రిటైనింగ్ వాల్‌తో శాశ్వత రక్షణ
ఖమ్మం అర్బన్/ఖమ్మం రూరల్: మున్నేరు నదీ పరీవాహక ప్రాంత ప్రజలు వరదలతో ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారానికి రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అధికారులతో కలిసి సోమవారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన వరదతో మున్నేరు పరీవాహక ప్రాంతంలో వేలాది కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇరువైపులా 17 కి.మీ. పొడవుతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇందుకోసం రూ.676 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు4,155 మీటర్ల ఎర్త్‌వర్క్, 3,495 మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాగా, నిర్మాణంలో భూమి కోల్పోయే నిర్వాసితుల కోసం రివర్ ఫ్రంట్‌లోనే పోలేపల్లి వద్ద కాలనీ ఏర్పాటుచేసి ఇంటి స్థలాలు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. అనంతరం జలగం నగర్, నాయుడుపేట వద్ద తీగల వంతెన నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి పరిశీలించి నాణ్యతపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు ఎం.వెంకటేశ్వర్లు, యాకూబ్, ఆర్డీఓ జి.నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు యుగంధర్, వాణిశ్రీ, రంజిత్‌కుమార్, రమేష్‌రెడ్డి, పి.రాంప్రసాద్, అశోక్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ – బీఆర్‌ఎస్‌ది ఉమ్మడి నాటకం..
ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఉమ్మడిగా నాటకానికి తెర లేపారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులపై ఓ పార్టీ నేతలు రాసిన స్క్రిప్ట్‌ను ఇంకో పార్టీ నేతలు బయటకు చెబుతున్నారని అన్నారు. రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంపై రూ.8.19 లక్షల కోట్ల అప్పు ఉందనే విషయాన్ని అసెంబ్లీలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు వివరించారని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు హద్దు మీరి విమర్శలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, 90 శాతం పనులు చేశామని చెబుతూ, ఇంకా 40 శాతం మిగిలాయని వెల్లడించడం గర్హనీయమని పేర్కొన్నారు.
నిర్వాసితుల కోసం
‘రివర్ ఫ్రంట్’ కాలనీ
నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి
మసీదుల అభివృద్ధికి నిధులు
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మసీదుల అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ.లక్ష చొప్పున 18 మసీదులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి చెక్కులు అందజేశాక మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్‌తో పాటు యాకూబ్‌పాషా, సైదులు తదితరులు పాల్గొన్నారు.


