భూ సమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’
బోనకల్: భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని గోవిందాపురం(ఎల్), కలకోట గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఆయన మాట్లాడారు. భూములపై రైతులకు జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ చట్టం ఉపకరిస్తుందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్‌ఓఆర్‌లో మార్పులు, చేర్పులు వంటి సేవలను భూభారతి చట్టంలో పొందుపర్చారని వివరించారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని తెలిపారు. భూమి హక్కులు ఎలా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డుల్లో నమోదు చేయొచ్చని చెప్పారు. రైతులు తమకు న్యాయం జరగలేదని భావిస్తే రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చినా వాటిని తొలగించే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దుచేసే అధికారం ఉంటుందని అన్నారు. కాగా, భూ సమస్యల పరిష్కారానికి కలకోటలో 125, గోవిందాపురంలో 69 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో తహసీల్దార్ పున్నం చందర్, ఇన్‌చార్జ్ తహసీల్దార్ రాంబాబు, ఆర్‌ఐలు నవీన్, మైథిలీ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి


