లాహిరి..లాహిరి.. లాహిరిలో.. | - | Sakshi
Sakshi News home page

లాహిరి..లాహిరి.. లాహిరిలో..

Dec 30 2025 7:49 AM | Updated on Dec 30 2025 7:49 AM

లాహిరి..లాహిరి.. లాహిరిలో..

లాహిరి..లాహిరి.. లాహిరిలో..

సాయంత్రం 6–03 గంటలకు మొదలైన తెప్పోత్సవం

భక్తులతో నిండిపోయిన పుష్కరఘాట్‌, కరకట్ట

భద్రాచలం: భక్తుల జయజయ ధ్వానాలు, శ్రీరామనామస్మరణల నడుమ శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామి జలవిహారం చేస్తుండగా గోదావరి తీరం పులకించింది. కరకట్ట, స్నానఘాట్ల నిండుగా భక్త జనం వీక్షిస్తుండగా స్వామి వారు లాహిరి.. లాహిరి.. లాహిరిలో అంటూ జల విహారం చేశారు. భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో శ్రీ సీతారాముల తెప్పోత్సవం కనులపండువగా సాగింది.

కట్టుదిట్టమైన భద్రత

తెప్పోత్సవం సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌ ఆధ్వర్యాన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌, ముక్కోటి ఉత్సవ అధికారి శ్రీనివాసరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌, ఎస్పీ రోహిత్‌రాజుతో పాటు జిల్లా అధికారులు తరలివచ్చారు.

ముగిసిన పగల్‌పత్తు ఉత్సవాలు

తెప్పోత్సవానికి ముందు ప్రధాన ఆలయంలో పగల్‌పత్తు ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం అనంతరం సేవాకాలం, తిరుమంగై అళ్వార్‌ పరమపదోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతి పూజలతో పగల్‌ పత్తు ఉత్సవాలు ముగిశాయి. ఆ తర్వాత గర్భగుడిలో ప్రభుత్వోత్సవం(దర్బార్‌ సేవ) నిర్వహించారు.

నేటి నుంచి రాపత్తు సేవలు

వైకుంఠ ఏకాదశి ముగిసిన తర్వాత శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రాపత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్వామివారికి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నుంచి జనవరి 12 వరకు ఈ సేవలు నిర్వహిస్తారు. తొలిరోజు శ్రీరామరక్షామండపం(డీఎస్పీ కార్యాలయ ప్రాంగణం) వద్ద రాపత్తు విలాసోత్సవం జరగనుంది.

ఐదు పర్యాయాలు విహారం

పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ చేపట్టిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక సాయంత్రం 6–03 గంటలకు హంస వాహనం కదిలింది. ఉత్తర దిశగా గోదావరి నదిలో ముందుకు సాగి, ఆ తర్వాత సవ్యదిశలో పరిక్రమణం ప్రారంభమైంది. విద్యుత్‌ దీప కాంతులతో ధగధగా మెరుస్తున్న హంస వాహనం, అందులో ఆశీనులైన సీతారాములను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. అప్పటికే పుష్కరఘాట్‌లో ఉన్న మెట్లన్నీ వేలాదిగా భక్తులతో నిండిపోయాయి. మెట్లపై స్థలం లేకపోవడంతో కరకట్టపైనా, లాకుల వద్దనున్న ఎత్తయిన ప్రాంతంలో నిలబడి సీతారాముల జల విహారాన్ని తిలకించారు. ఆ సమయంలో జై శ్రీరామ్‌ నామస్మరణతో గోదారి తీరం మార్మోగింది. ఐదు పర్యాయాలు స్వామివారు నదిలో విహరించగా, ఒక్కో పరిక్రమణానికి సగటున 13 నిమిషాల సమయం పట్టింది. తెప్పోత్సవాన్ని పురస్కరించుకుని గతేడాది తరహాలోనే గోదావరి తీరంలో పుష్కరఘాట్‌ దగ్గర ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికపై శాసీ్త్రయ, గిరిజన సంప్రదాయ నృత్య, గాన ప్రదర్శనలు కొనసాగాయి. తెప్పోత్సవం అనంతరం ఆగమ శాస్త్ర పద్ధతులు అనుసరిస్తూ సీతారాములను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు.

నేడు ఉత్తర ద్వార దర్శనం

బ్రహ్మకాలంలో ప్రారంభం

కానున్న పూజలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారంలో దర్శనమివ్వనున్నారు. ఏడాదిలో ఒకసారి మాత్రమే జరిగే ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భద్రగిరికి పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా బ్రహ్మ కాలంలో ప్రత్యేక వాహనంపై ఆశీనులైన లక్ష్మణ సమేత సీతారాములను ఉత్తర ద్వారం వద్ద కొలువుదీరుస్తారు. వైకుంఠ ఏకాదశి వైభవం, మంగళ వాద్యఘంట, వేద పారాయణం తర్వాత ఆరాధన, శ్రీరామ షడాక్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన వంటి పూజాదికాలు నిర్వహిస్తారు. ఉత్తర ద్వార దర్శన ప్రాశస్థ్యాన్ని స్థానాచార్యులు వివరించాక 108 వత్తులతో హారతి ఇస్తూ శరణాగతి గద్య విన్నపం చేస్తారు. ఆ తర్వాత వైకుంఠ ద్వారం తెరిచి భక్తులు దర్శన భాగ్యం కలిగిస్తారు.

పూజా విశేషాలు ఇలా

తెల్లవారు జామున 4.30 నుంచి ఉదయం 5 గంటల వరకు వైకుంఠ ఏకాదశి వైభవం

5 నుంచి 5:40 వరకు ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వార దర్శన విశిష్టత వివరణ

ఆ తర్వాత 108 వత్తులతో హారతి.. శరణాగతి గద్యవిన్నపం

ఉదయం 6 గంటలకు ఉత్తర ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటుండగా ధూపాన్ని చీల్చుతూ హరతి వెలుగుల నడుమ స్వామివారి దర్శనం

హంస వాహనంలో శ్రీ సీతారాముల జల విహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement