ఇక మున్సిపోల్‌కు సన్నద్ధం!? | - | Sakshi
Sakshi News home page

ఇక మున్సిపోల్‌కు సన్నద్ధం!?

Dec 30 2025 7:49 AM | Updated on Dec 30 2025 7:49 AM

ఇక మున్సిపోల్‌కు సన్నద్ధం!?

ఇక మున్సిపోల్‌కు సన్నద్ధం!?

● కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్‌ ● వచ్చేనెల 10న వార్డుల వారీగా తుదిజాబితా ● నోటిఫికేషన్‌లో కానరాని కేఎంసీ, మణుగూరు మున్సిపాలిటీ ● ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని ప్రచారం

నేటి నుండి ప్రారంభం

● కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్‌ ● వచ్చేనెల 10న వార్డుల వారీగా తుదిజాబితా ● నోటిఫికేషన్‌లో కానరాని కేఎంసీ, మణుగూరు మున్సిపాలిటీ ● ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని ప్రచారం

ఖమ్మంమయూరిసెంటర్‌: గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సోమవారం నోటిఫికేషన్‌ జారీచేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐ.రాణి కుముదిని విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్‌ వివరాలు ఉన్నాయి. అయితే, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌, మణుగూరు మున్సిపాలిటీ వివరాలను ఇందులో పొందుపర్చలేదు. కేఎంసీలో డివిజన్ల పెంపు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన నేపథ్యాన స్పష్టత వచ్చాకే ఓటర్ల జాబితా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా రూపకల్పనపై నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యాన ఫిబ్రవరిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయనే చర్చ మొదలైంది.

వార్డులు, జనాభా వివరాలు

ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఏదులాపురం మున్సిపాలిటీ జిల్లాలో అత్యధికంగా 32 వార్డులు కలిగి ఉంది. ఇక్కడ 38,210 మంది జనాభాకు గాను ఎస్సీ జనాభా 8,770, ఎస్టీ జనాభా 4,024 మంది ఉన్నారు. సత్తుపల్లి 23 వార్డులతో 31,857 జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ జనాభా 4,765, ఎస్టీ జనాభా 1,996 ఉన్నారు. వైరా 20 వార్డులతో 31,056 జనాభా కలిగి ఉంది. ఇందులో ఎస్సీ జనాభా 7,227, ఎస్టీ జనాభా 2,090 మంది ఉన్నారని నోటిఫికేషన్‌ పొందుపరిచారు. మధిర మున్సిపాలిటీ 22 వార్డులకు గాను 30,856 జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ 8,322, ఎస్టీలు 1,083 మంది ఉన్నారు. కల్లూరు 20 వార్డులతో ఇటీవల మున్సిపాలిటీగా ఏర్పడగా 22,748 జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ జనాభా 5,516, ఎస్టీ జనాభా 3,732 మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌, రెండు మున్సిపాలిటీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలో 60 వార్డులకు గాను 2011 లెక్కల ప్రకారం జనాభా 1,70,897గా ఉంది. ఇందులో ఎస్సీ జనాభా 33,287, ఎస్టీ జనాభా 30,904గా నమోదైంది. అలాగే, 24 వార్డులతో ఉన్న ఇల్లెందు మున్సిపాలిటీ జనాభా 33,732 కాగా, ఇందులో ఎస్సీలు 6,894, ఎస్టీ 2,574 మంది ఉన్నారు. ఇక అశ్వారావుపేట మున్సిపాలిటీ 22 వార్డులను కలిగి ఉండగా.. 20,040 మంది జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ జనాభా 3,310, ఎస్టీ జనాభా 2,457 మంది ఉన్నారు.

ఖమ్మంరూరల్‌: నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను ఓటర్ల జాబితా రూపొందించనున్నట్లు కమిషనర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ఆధారంగా జాబితా పునర్‌వ్యవస్థీకరణ, మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో తుది ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా మంగళవారం పోలింగ్‌ కేంద్రాల డేటాను మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా సర్దుబాటు చేయడంతో మొదలుపెట్టి జనవరి 10న వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ముగిస్తారు. ఈనెల 31న వార్డుల వారీగా డేటా పునర్‌వ్యవస్థీకరణ, జనవరి 1న ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరించాక జనవరి 5, 6వ తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. చివరగా 10వ తేదీన పోలింగ్‌ కేంద్రాల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఈ జాబితాను 2025 అక్టోబర్‌ 1నాటి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ఆధారంగా రూపొందిస్తున్నట్లు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం వివరాలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement