నియంత్రణలోనే నేరాలు
ఖమ్మంక్రైం: పోలీసు యంత్రాంగం సమష్టి కృషితో నేరాలు నియంత్రణలో ఉన్నాయని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఆయన వార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు. ఈ ఏడాది దోపిడీలు, ఇళ్లలో చోరీలు, హత్యలు, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు గణనీయంగా తగ్గగా, చోరీ సొత్తు రికవరీ 9 శాతం, నేరాలను ఛేదించడం 11 శాతం పెరిగిందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సుమారు రూ.4.5 కోట్లను బాధితులకు అందేలా చూడడంతో పాటు మరో రూ.1.50 కోట్లను హోల్డ్ చేయించామని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా 36,709 కేసుల పరిష్కారమయ్యాయని తెలిపారు. గంజాయి అమ్మకాలను కట్టడి చేశామని, పెట్రోలింగ్, ఆకస్మిక తనిఖీలు, కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమాలతో నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఉద్యోగులకు శిక్షణ ఇప్పించడం ద్వారా చోరీ సొత్తును రికవరీ చేయడంలో గణనీయమైన పురోగతి నమోదైందని తెలిపారు. అంతేకాక ప్రమాదాల నియంత్రణలో భాగంగా బ్లాక్ స్పాట్ల గుర్తింపు, సిగ్నల్ లైట్లు, బారికేడ్ల ఏర్పాటు, విద్యాసంస్థల్లో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలతో నష్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించామని వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు ప్రసాదరావు, రామానుజం, ఏసీపీలు వసుంధర యాదవ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, మహేష్, సర్వర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు కమిషనర్ సునీల్‌దత్


