లాభాల బాటలో రైతన్న
● సంప్రదాయ పంటలకు బదులు అరటి, జామ తోటలు ● సేంద్రియ విధానంలో సాగు, తోటల వద్దే అమ్మకం ● మిగతా పంటలతో పోలిస్తే లాభాలపై భరోసా
ముదిగొండ: ఈ రైతులు కూడా అందరిలాగే వరి, మిర్చి, పత్తి పంటలను ఏళ్ల తరబడి సాగు చేశారు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు వారిని వెంటాడాయి. ఫలితంగా ఏళ్లు గడుస్తున్న కొద్ది పెట్టుబడి పెరుగుతుందే తప్ప లాభాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న ఆ రైతులకు పండ్ల తోటలు కళ్ల ముందు కనిపించాయి. రసాయన ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ విధానంలో పంటల సాగు ఆరంభించిన వారు ఇప్పుడు అధిక దిగుబడి సాధిస్తున్నారు. రసాయన ఎరువులు వాడకపోవడంతో పండ్లు రుచికరంగా ఉండగా.. వ్యాపారులే తోటల వద్దకు కొనుగోలు చేస్తుండడంతో రవాణా ఖర్చులు తగ్గి లాభాలు లాభాలు ఆర్జిస్తున్నారు. ముదిగొండ మండలం మేడేపల్లిలో పలువురు రైతులు ఈ బాటలో పయనిస్తుండగా ఆ గ్రామ రైతులే కాక చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా వీరిని అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు.
జామ.. తైవాన్ పింక్
ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన సామినేని రమేష్ ఏడాదిన్నర క్రితం ఏపీలోని జంగారెడ్డిగూడెం వద్ద నర్సరీలో 19వేల తైవాన్ పింక్ జామ మొక్కలు తీసుకొచ్చాడు. ఒక్కో మొక్కకు రూ.15 వెచ్చించగా.. ఎకరానికి 1,300 చొప్పున 20ఎకరాల్లో సాగు చేశాడు. డ్రిప్ ఇరిగేషన్, పైపులు, బావి, ఫెన్సింగ్, కూలీలు, మొక్కలు కలిపి రూ.20లక్షల మేర పెట్టుబడి అయింది. డ్రిప్ ఇరిగేషన్ విధానం కావడంతో నీరు, ఎరువులు మొక్కకు నేరుగా అందించడం సాధ్యమవుతోంది. మొక్కలు నాటాక ఎనిమిదో నెల నుంచి జామ దిగుబడి మొదలైంది. మొదటి కాపు 75టన్నులు రాగా.. కిలో రూ.25నుంచి రూ,30 వరకు తోట దగ్గరే విక్రయించానని రమేష్ తెలిపారు. ఇక వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక యంత్రాన్ని అమర్చడంతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుందని వెల్లడించారు. ఈ యంత్రానికి రూ.50వేలు వెచ్చించినట్లు తెలిపారు. కాయలకు మచ్చలు రాకుండా, చీడపీడలు ఆశించకుండా కవర్లు తొడగడం... సేంద్రియ విధానం కావడంతో కాయలు రుచిగా ఉండి వ్యాపారులు నేరుగా తోట వద్దకు కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. ఫలితంగా తనకు రవాణా ఖర్చులు తగ్గాయని తెలిపారు.
అటు అరటి.. ఇటు జామ
మేడిపల్లి గ్రామానికే చెందిన మేడిశెట్టి నరసింహారావు అరటి సాగు చేస్తున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఒక్కో మొక్క(దుంప) రూ.10 చొప్పున తీసుకొచ్చి ఎకరానికి వెయ్యి మొక్కలు నాటారు. ఎకరాకు రూ.30 వేలు ఖర్చు కాగా.. కర్పూర రకం మొక్కలు కావడంతో నాటిన 11నెలలకు దిగుబడి వచ్చింది. టన్ను రూ.14వేల నుంచి రూ.20వేలు వరకు తోట దగ్గరే అమ్ముతున్న ఆయన ఎకరాకు రూ.లక్ష మేర లాభం వస్తోందని తెలిపారు. దీనికి తోడు అంతర పంటగా జామ కూడా సాగు చేస్తుండగా అదనపు ఆదాయం లభిస్తోందని వెల్లడించారు.
లాభాల బాటలో రైతన్న


