ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిందే
ఖమ్మంమయూరిసెంటర్: పహెల్గాం దాడి తర్వాత దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తుదముట్టించాల్సిందేనని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో బుధవారం జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పహెల్గాం ఘటన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంటోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయాన ఉద్రిక్తతను మనోన్మాదులు అవకాశంగా తీసుకోకుండా చూడాలని కోరారు. కాగా, ప్రధాని మోదీ పేదలు, వ్యవసాయ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి సంపన్న వర్గాలపై దృష్టి సారించారని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో జాప్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా, భవిష్యత్‌లో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హేమంతరావు పేర్కొన్నారు. సీపీఐ శత వసంతాల ముగింపు సభ ఖమ్మంలో జరగనుండగా, ఆలోపే మండల, జిల్లా మహాసభలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో నాయకులు దండి సురేశ్, మహ్మద్ మౌలానా, బెజవాడ రవి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు
హేమంతరావు


