పెద్దాస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఆస్పత్రికి వచ్చిన ఆయన వివిధ విభాగాలను పరిశీలించి వాహనాల పార్కింగ్, ఆస్పత్రి ప్రధాన గేట్ బయట రద్దీ నియంత్రణపై చర్చించారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. మంత్రుల పర్యటన నాటికి ఆస్పత్రిలో కావాల్సిన వైద్య పరికరాలు, సౌకర్యాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆతర్వాత పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, సూచిక బోర్డుల ఏర్పాటు, మరమ్మతులపై సూచనలు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ షఫీఉల్లా, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


