వేతనం సకాలంలో చెల్లించాల్సిందే..
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాకు వలస వచ్చి పనులు చేసిన కూలీల కష్టార్జితాన్ని సకాలంలో చెల్లించాలని యజమానులకు జిల్లా ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిల్లాలోని మధిర మండలం వంగవీడు గ్రామంలో మిర్చి తోటలో పని చేసేందుకు మహారాష్ట్రలోని బల్లార్షా ప్రాంతం నుంచి 10 మంది వలస కూలీలను యజమానులు తీసుకొచ్చారని, కిలో మిర్చికి రూ.30 చెల్లిస్తామని నిర్ణయించారని, మిర్చి కోసినందుకు కూలీ రూ.1,14,210లు కాగా.. యజమాని వలస కూలీలకు రూ.5 వేలు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. మిగిలిన కూలీ ఇవ్వకపోవడంతో వలస కూలీలు కార్మికశాఖ అధికారులను సంప్రదించారని, అధికారులు ఈ నెల 24న కూలీలకు ఆ కూలీ మొత్తం ఇప్పించి, వారిని జీటీ ఎక్స్‌ప్రెస్ ద్వారా బల్లార్షాకు సురక్షితంగా పంపించామని విజయ్‌భాస్కర్‌రెడ్డి తెలిపారు.
ఇసుక డంప్‌ల సీజ్
తిరుమలాయపాలెం: మండలంలోని బాలాజీనగర్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రమణాతండాలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను మండల తహసీల్దార్ సుధీర్, పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. మొత్తం 50 ట్రిప్పుల ఇసుక ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రంగారెడ్డి ఆర్‌ఐ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉషూ జట్ల ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ పోటీల్లో జిల్లా జట్లను జిల్లా ఉషూ సంఘం ప్రకటించింది. క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, ఉషూ కోచ్ పి.పరిపూర్ణాచారి కోరారు.
సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలి..
ఖమ్మంసహకారనగర్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి ప్రభుత్వ ఆధీనంలోనే విద్యారంగం కొనసాగేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. శుక్రవారం సంఘం కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని నమ్మకం కలిగించేలా ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకురావాలని, విద్యారంగంలో ప్రైవేటీకరణను నియంత్రించాలని, ప్రతి గ్రామంలో ఒకటే బడి అదే ప్రభుత్వ బడి ఉండేలా కామన్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. అనంతరం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వై.పద్మ, రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడారు. సమావేశంలో వెంగళరావు, కె.వెంకటేశ్వరరావు, వీరబాబు, ముత్తయ్య, నాగిరెడ్డి, ఉమాదేవి, నాగేశ్వరరావు, యాకూబ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
వేతనం సకాలంలో చెల్లించాల్సిందే..
వేతనం సకాలంలో చెల్లించాల్సిందే..
వేతనం సకాలంలో చెల్లించాల్సిందే..


