జీపీఎస్ సర్వేతో నూతన భూకొలతలు
● లక్షకు పైగా సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం ● భూ భారతి సదస్సులో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
నేలకొండపల్లి: ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన భూ భారతి చట్టం చట్టంతో భూసంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూమి స్వభావం, కొలతలు పక్కాగా తేల్చాల్సి ఉన్నందున జీపీఎస్ సాంకేతికతతో కూడిన యంత్రాలతో సర్వే చేయిస్తామని తెలిపారు. తద్వారా యాజమాన్య హక్కులు నిర్ధారించొచ్చని చెప్పారు. అంతేకాక జిల్లాలో పెండింగ్ ఉన్న లక్షకు పైగా సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం కూడా సాధ్యమవుతుందని తెలిపారు. ఇంకా వారసత్వ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్పీల్ తదితర అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అనంతరం చట్టంలోని పలు అంశాలను వ్యవసాయ రైతు సంక్షేమ సంఘం సభ్యుడు, న్యాయవాది ‘భూమి’ సునీల్ వివరించగా, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ నరసింహారావు, పాలేరు ప్రత్యేకాధికారి రమేష్, ఏడీఏ బి.సరిత, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎం.ఎర్రయ్య, ఏఓ ఎం.రాధ తదితరులు పాల్గొన్నారు.
సాగులో కొత్త విధానాలతో అధిక దిగుబడి
తల్లాడ: రైతులు కొత్త సాగు విధానాలు అవలంబించేలా అధికారులు అవగాహన కల్పించాలని, తద్వారా అధిక దిగుబడి సాధ్యమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. తల్లాడ మండలం కుర్నవల్లిలో గురువారం వైరా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యాన నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులతో మమేకమై వారికి సాగులో మెళకువలను వివరించాలన్నారు. డీఏఓ డి.పుల్లయ్య మాట్లాడగా, సత్తుపల్లి ఏడీఏ శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.జే.హేమంత్‌కుమార్, కేవీకే కోఆర్డినేటర్ కె.రవికుమార్, తహసీల్దార్ సురేష్‌కుమార్, ఏఓ ఎం.డీ.తాజుద్దీన్, ఎంపీడీఓ సురేష్‌బాబు, ఏపీఎం అశోకారాణి పాల్గొన్నారు. కాగా, పలువురు రైతులు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని వెల్లడించగా.. గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి కలెక్టర్ వెళ్లి పరిశీలించారు.
జీపీఎస్ సర్వేతో నూతన భూకొలతలు


