వంట చేస్తుండగా గ్యాస్ లీక్
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి సీఎస్‌ఐ చర్చి రోడ్డులోని అలవాల ప్రశాంత్ ఇంట్లో శుక్రవారం వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. దీంతో కుటుంబీకులు ఆందోళన చెందగా, స్థానికులతో పాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే రూ.50 వేల విలువైన సామగ్రి కాలిపోయింది. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ ఉద్యోగులు గ్యాస్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంటలు ఆర్పడంపై స్థానికులకు అవగాహన కల్పించారు.
ట్రాక్టర్ ఫైనాన్స్ బకాయి.. ఆత్మహత్య
బోనకల్: మండలంలోని గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన వ్యక్తి గడ్డి మందు తాగగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఇసంపల్లి సైదా(30) ట్రాక్టర్ కోసం రుణం తీసుకోగా, కిస్తీలు బకాయి పడ్డాడు. దీంతో కంపెనీ బాధ్యులు ఒత్తిడి చేయడం, చెప్పిన గడువు కూడా ముగియడంతో ఫోన్ స్విచ్చాప్ చేసుకున్నాడు. ఈక్రమాన వారు గ్రామంలోని కొందరికి ఫోన్ చేసి ట్రాక్టర్ తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. ఈ విషయం సైదాకు తెలియడంతో గురువారం గడ్డి మందు తాగగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సైదా మృతి చెందడంతో ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుబాబు తెలిపారు.
అనారోగ్య కారణాలతో మరో వ్యక్తి...
చింతకాని: భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెంకు చెందిన వడుగు అజయ్‌కృష్ణ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చింతకాని మండలం చిన్నమండవకు చెందిన లక్ష్మీతిరుపతమ్మను 13ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఆయన ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం చిన్నమండవ వచ్చాడు. ఇక్కడ వెల్డింగ్ పనులతో జీవనం సాగిస్తుండగా మద్యానికి బానిసైన అజయ్‌కృష్ణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం పనుల కోసం నాగులవంచ వెళ్తున్నట్లు చెప్పి అక్కడే పురుగుల మందు తాగాడు. స్థానికుల ద్వారా తెలుసుకున్న కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. అజయ్‌కృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి గంజాయితో పట్టుబడ్డాడు. సీఐ రమేష్ వెల్లడించిన వివరాలు.. మధిరకు చెందిన రాజకొండ దుర్గారావు బొక్కలగడ్డ వెంకటేశ్వర్‌నగర్‌లో ఉంటూ చిరువ్యాపారం చేస్తున్నాడు. త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విజయవాడ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈనేపథ్యాన పెట్రోలింగ్ చేస్తున్న ఎస్‌ఐ రమేష్ ఆయనన తనిఖీ చేయడంతో రూ.20వేల విలువైన 450 గ్రాముల గంజాయి లభించింది. దీంతో నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
వంట చేస్తుండగా గ్యాస్ లీక్


