● నెలలో 22 మస్టర్లు పనిచేసిన వారికే వర్తింపు ● ఫిబ్రవరి ఇన్సెంటివ్ నేడు చెల్లింపు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఏడాది నిర్దేశించుకున్న వార్షిక లక్ష్యం 72 మిలియన్ టన్నులు సాధించడానికి గాను జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతీ గనికి (ఓపెన్‌కాస్ట్, భూగర్భ) డిపార్ట్‌మెంట్ (సీహెచ్‌పీ)లకు కొంత టార్గెట్ నిర్ణయించింది. లక్ష్యాన్ని సాధించేందుకు గాను ఈ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ఈ మూడు మాసాల్లో నెలకు కనీసం 22 మస్టర్లు పనిచేయాలని, అలా చేసిన వారికి మాత్రమే ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఇన్సెంటివ్‌ను గురువారం ఆయా కార్మికులకు చెల్లించనుంది.
లక్ష్యాలు ఇలా..
ఆర్జీ–1లోని జీడీకే–11 ఇంక్లెయిన్ గనిలో 58,800 టన్నుల లక్ష్యానికి గాను 75,301 టన్నులు సాధించగా ఆ గనిలో పనిచేసే ఉద్యోగులకు రూ.2,500 స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వనుంది. మణుగూరులోని ఓసీ–2లో 1,68,000 టన్నుల లక్ష్యానికి 2,08,580 టన్నులు సాధించగా ఆయా ఉద్యోగులు రూ. 2,200 చొప్పున, ఇల్లెందులో 1,96,000 టన్నుల లక్ష్యానికి 2,29,617 టన్నులు సాధించారు. ఆ గని ఉద్యోగులు రూ. 2,200 చొప్పున నేడు ఇన్సెంటివ్ అందుకోనున్నారు. అయితే గ్రేడ్‌ల ఆధారంగా ఈ ఇన్సెంటివ్ చెల్లిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.
మిగతా ఏరియాల్లో ఇలా..
● కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్‌ఓసీ–2లో 9,52,000 టన్నుల లక్ష్యానికి 10,13,430 టన్నులు (106 శాతం)సాధించగా, ఈ ఓసీలో పనిచేసే ఉద్యోగులు రూ.2,200 ఇన్సెంటివ్ అందుకోనున్నారు.
● భూపాలపల్లి ఏరియా కేటీకే 8 ఇంక్లెయిన్‌లో 16,800 టన్నుల లక్ష్యానికి 17,043 టన్నులు సాధించగా వీరికి రూ.1,200 ఇన్సెంటివ్ రానుంది.
● భూపాలపెల్లి కేటీకే ఓసీ–2లో 1,40,000 టన్నుల లక్ష్యానికి 1,52,665 టన్నులు సాధించగా ఇక్కడి ఉద్యోగులకు రూ.1,700 ఇన్సెంటివ్ చెల్లించనుంది.
● మందమర్రి ఏరియాలోని కేకే5 గనిలో 16,800 టన్నుల లక్ష్యానికి 16,802 టన్నులు సాధించగా వీరికి రూ.1,200 ఇన్సెంటివ్ రానుంది.
● మందమర్రి ఏరియాలోని కేకే ఓసీలో 1,12,000 టన్నుల లక్ష్యానికి 1,31,173 టన్నులు సాధించగా, ఇందులో పనిచేసే కార్మికులకు రూ.1,200 ఇన్సెంటివ్ చెల్లించనుంది.
● శ్రీరాంపూర్‌లోని ఆర్కే–5 గనిలో 21,000 టన్నుల లక్ష్యానికి 21,478 టన్నులు సాధించగా ఇక్కడి ఉద్యోగులకు రూ.1,500 చొప్పున, అదే ఏరియాలోని ఆర్కే–6 ఇంక్లెయిన్‌లో 14,840 టన్నులకు 15,683 టన్నుల ఉత్పత్తి సాధించగా వీరికి రూ.1,700 చొప్పున ఇన్సెంటివ్ చెల్లించనుంది. రామకృష్టాపూర్‌లోని రాంటెంకి గనిలో 14 వేల టన్నుల లక్ష్యానికి 14,694 టన్నులు సాధించగా అక్కడి ఉద్యోగులు రూ.1,200 చొప్పుఏ ఇన్సెంటివ్ అందుకోనున్నారు.