
మున్నేరుపై కొత్త వంతెనలు
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలోకి ప్రవేశించేందుకు కీలకంగా నిలుస్తూ మున్నేటిపై ఉన్న రెండు వంతెనలకు తోడు అదనపు బ్రిడ్జిల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. కరుణగిరి, ప్రకాష్‌నగర్ వద్ద రెండు లేన్లతో ఉన్న ఈ వంతెనల పక్కన మరో రెండు లేన్లతో వంతెనలు నిర్మిస్తారు. ఇందుకోసం రూ.40కోట్ల చొప్పున రూ.80కోట్లు మంజూరు కాగా టెండర్లు ఆహ్వానించడంపై అర్‌అండ్‌బీ అధికారులు దృష్టి సారించారు.
కీలకంగా వంతెనలు
జిల్లా కేంద్రం మీదుగా ఇతర ప్రాంతాలకు వారధిగా నిలుస్తున్న ఈ వంతెలు ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్నాయి. అయితే, వంతెనలకు ముందు, తర్వాత రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించారు. దీంతో వంతెన వరకు రాకపోకలు సాఫీగా సాగుతున్నా బ్రిడ్జిలపైకి వచ్చేసరికి భారీ వాహనాలతో ఇరుకుగా మారి తరచూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. దీనికి తోడు ఖమ్మం చుట్టూ జాతీయ రహదారుల నిర్మాణం చివరి దశకు చేరింది. ఈమేరకు రెండు బ్రిడ్జిలకు పక్కన మరో రెండు వరుసలతో నూతన బ్రిడ్జిలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. మున్నేరుపై మూడు బ్రిడ్జిలు ఉండగా, కాల్వొడ్డులో పాత వంతెనను ఆనుకుని రూ.180 కోట్లతో తీగల వంతెన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఆపై కరుణగిరి, ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిల సమీపాన కొత్తగా రెండేసి వరుసలతో బ్రిడ్జిలు నిర్మిస్తే రహదారులకు అనుగుణంగా నాలుగు లేన్ల రోడ్డు అందుబాటులోకి వస్తుంది. తద్వారా జాతీయ రహదారులకు అనుగుణంగా వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయని భావిస్తున్నారు.
పాత బ్రిడ్జిల వెంట నిర్మాణం
ప్రకాష్‌నగర్, కరుణగిరి వద్ద
రెండేసి లేన్లతో నిర్మాణానికి నిర్ణయం
రూ.80కోట్ల నిధులు మంజూరు..