గూగుల్‌ మ్యాప్‌తో ధనవంతుల ఇళ్ల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

గూగుల్‌ మ్యాప్‌తో ధనవంతుల ఇళ్ల గుర్తింపు

Mar 19 2025 12:06 AM | Updated on Mar 19 2025 12:06 AM

గూగుల

గూగుల్‌ మ్యాప్‌తో ధనవంతుల ఇళ్ల గుర్తింపు

● ఆపై చోరీలు.. సొత్తుతో సహా శ్మశానాల్లోనే నివాసం ● తల్లికి చీర కొనేందుకు తొలిసారి చోరీ ● 90కి పైగా కేసులు, కానిస్టేబుల్‌పై కత్తి దాడి నిందితుడి అరెస్ట్‌

సత్తుపల్లి: సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి గూగుల్‌ మ్యాప్‌ ద్వారా అత్యాధునిక భవంతులను గుర్తించి చోరీ చేయడం, ఆపై చోరీ సొత్తును శ్మశానాల్లోనే దాచి అక్కడే బస చేయడం ఆయనకు అలవాటు. తల్లికి చీర కొనేందుకు రూ.300కోసం తొలిసారి చోరీ చేసిన నిందితుడు.. వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాక నాలుగు నెలల్లోనే ఎనిమిది జిల్లాల్లో 43కు పైగా చోరీలు చేయడం గమనార్హం. ఈక్రమంలో తనను పట్టుకునేందుకు సిద్ధమైన కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి పరారైన నిందితుడిని సత్తుపల్లి పోలీసులు అరెస్ట్‌ చేయగా వివరాలను మంగళవారం ఖమ్మం పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ వెల్లడించారు.

కానిస్టేబుల్‌పై దాడి

సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ నెల 10వ తేదీ రాత్రి అనుమానాస్పదంగా తచ్చాడుతున్న సురేందర్‌ను విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ ఎం.నరేష్‌ విచారించే క్రమాన కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీంతో ఏసీపీ అనిశెట్టి రఘు ఆధ్వర్యాన సీఐ టి.కిరణ్‌, ఎస్సైలు కవిత, వీరేందర్‌, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈమేరకు సురేందర్‌ పట్టుబడగా చోరీ సొత్తు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సునీల్‌దత్‌ తెలిపారు. అయితే, ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందా, మిగతా సొత్తు ఎవరికి విక్రయించాడనే కోణంలో విచారిస్తూ ఆయనపై పీడీ యాక్ట్‌ నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. కాగా, నిందితుడిని అడ్డుకునే క్రమంలో కత్తి పోట్లకు గురైన కానిస్టేబుల్‌ ఎం.నరేష్‌, పోలీసులకు సహకరించిన యువకులు చెరుకుపల్లి ప్రసాద్‌, ఎల్లంగి రాజుకు సీపీ క్యాష్‌ రివార్డులు అందించారు. అలాగే, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై కవిత, కానిస్టేబుళ్లు ఎం.శ్రీనివాస్‌, శ్రావణ్‌రెడ్డి, ఇమ్రాన్‌ను అభినందించగా.. సత్తుపల్లి పట్టణ, రూరల్‌ సీఐలు టి.కిరణ్‌, ముత్తిలింగం, ఎస్సై వీరేందర్‌ పాల్గొన్నారు.

సాంకేతికత అండగా..

ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చితాపూర్‌కు చెందిన తిరువీధుల సురేందర్‌ తల్లికి రూ.300 విలువైన చీర కొనేందుకు మొదటిసారి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆతర్వాత ఆయన 90 కేసుల్లో ముద్ధాయిగా ఉండగా.. చర్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కేసులో శిక్ష అనుభవిస్తూ గతేడాది నవంబర్‌లో బెయిల్‌పై వచ్చాడు. ఆతర్వాత ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో 15, సూర్యాపేటలో ఏడు, నల్లగొండ, ఏలూరు జిల్లాల్లో ఐదు చొప్పున, కొత్తగూడెం జిల్లాలో నాలుగు, వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో మూడు ఇలా మొత్తం 43 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అయితే, దొంగతనానికి ఇళ్లు ఎంచుకునే క్రమాన గూగుల్‌ మ్యాప్‌ సాయం తీసుకునే సురేందర్‌ అత్యాధునిక భవంతులను గుర్తించి ధనవంతులు ఉంటున్నారని తేల్చుకుని రంగంలోకి దిగుతాడు. చోరీ చేసిన సొత్తును శ్మశానవాటికల్లో దాచిపెట్టడం.. ఆయన కూడా అక్కడే ఉంటూ గడిచిన నాలుగు నెలల్లోనే 43చోట్ల రూ.3.33లక్షల నగదు, 461.18 గ్రాముల బంగారు ఆభరణాలు, 424 గ్రాముల వెండి ఆభరణాలే కాక రెండు బైక్‌లు, సెల్‌ఫోన్లు చోరీ చేశాడు.

గూగుల్‌ మ్యాప్‌తో ధనవంతుల ఇళ్ల గుర్తింపు1
1/1

గూగుల్‌ మ్యాప్‌తో ధనవంతుల ఇళ్ల గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement