● చివరి ఆయకట్టు వరకు సాఫీగా నీటి సరఫరా ● పాలేరు రిజర్వాయర్‌తో పాటు పంటలు పరిశీలించిన కలెక్టర్
ఖమ్మం రూరల్/కూసుమంచి: వేసవికాలం మొదలైనందున తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో కలెక్టర్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించిన ఆయన నీటిమట్టం, సాగర్ నుండి వస్తున్న నీటి వివరాలు ఆరా తీయడంతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులకు సూచనలు చేశారు. వారబందీ విధానంలో నీరు విడుదల చేస్తూనే మధ్యలో ఎక్కడా వృథా కాకుండా చూడాలని, తద్వారా చివరి ఆయకట్టుకు చేర్చాలని తెలిపారు. సాగునీటి విడుదల, ఆపే విషయమై రైతులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అలాగే, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులో పంటలను పరిశీలించిన కలెక్టర్ సాగునీటి సమస్యపై రైతులతో మాట్లాడారు. తల్లంపాడు కాల్వ గట్టు నుండి యడవల్లి వరకు బైక్‌పై వెళ్లిన కలెక్టర్ అక్కడ మిర్చి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. సాగర్ ఆయకట్టులో ఎకరం కూడా ఎండిపోకుండా అధికారులు పర్యవేక్షించాలని, పంట కోతలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తహసీల్దార్ కరుణశ్రీ, ఇరిగేషన్ డీఈఈ మధు, ఏడీఏ సరిత, ఏఓ వాణి తదితరులు పాల్గొన్నారు.
పిల్లల సమగ్రాభివృద్ధికి చర్యలు
ఖమ్మంవన్‌టౌన్: బాలల సదనంలో ఉంటున్న పిల్లల సమగ్రాభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. బాలల సదనం పిల్లలను కలెక్టరేట్‌కు తీసుకురాగా ఆయన చదువు, ఇతర వివరాలు తెలుసుకున్నారు. పిల్లలను క్యాంటీన్‌కు తీసుకుని వెళ్లి స్వయంగా భోజనం వడ్డించారు. ఇటీవల వండర్ లాకు వెళ్లివచ్చిన పిల్లల అనుభవాలు తెలుసుకోవడమే కాక బాలల సదనంలో కంప్యూటర్లు సమకూర్చాలని, పర్యాటక ప్రదేశాలతో పాటు టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్‌కు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, డీసీపీయూ విష్ణువందన తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు
ఖమ్మం సహకారనగర్: మహిళలను గౌరవిస్తూ వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలోఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళా అధికారులు, ఉద్యోగులు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారన్నారు. తల్లిదండ్రులు సైతం అమ్మాయిలపై వివక్ష చూపకుండా అబ్బాయిలతో సమానంగా చదివించాలని తెలిపారు. కాగా, కలెక్టరేట్‌లోని మహిళా ఉద్యోగులు వారి ఇంటి పరిసరాల్లో ఎవరికై నా ఆడపిల్ల పుడితే స్వీట్ బాక్స్‌తో వెళ్లి అభినందనలు తెలపాలన్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ కళావతిబాయి తదితరులు మాట్లాడగా బాల సదనం చిన్నారులు, పలు కళాశాలల విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అలాగే, చదువు, క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థినులు, ఎన్‌సీసీ కేడెట్లు, మహిళా ఉద్యోగులకు డీఆర్వో పద్మశ్రీ జ్ఞాపికలు అందజేశారు. ఆతర్వాత బేటీ బచావో, బేటీ పడావో పోస్టర్లను ఆవిష్కరించారు. డీడబ్ల్యూఓ కెరాంగోపాల్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ అరుణ, వివిధ శాఖల అధికారులు విష్ణు వందన, సమ్రీన్ తదితరులు పాల్గొన్నారు.
●రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని అంగన్‌వాడీ సెంటర్–4 టీచర్ ఉపవాణి బెస్ట్ టీచర్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఆమెకు డీడబ్ల్యూఓ జ్ఞాపిక, సర్టిఫికెట్ అందజేశారు.
అంబులెన్స్ ప్రారంభం
ఖమ్మంవైద్యవిభాగం: మారుమూల ప్రాంతాల ప్రజలకు సత్వరమే వైద్యసేవలు అందేలా ఆర్‌ఐఎన్‌ఎల్ సంస్థ బాధ్యులు కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా ఆర్ అంబులెన్స్ అందజేశారు. కామేపల్లి, కారేపల్లి ప్రాంత వాసుల కోసం సమకూర్చిన ఈ అంబులెన్స్ పత్రాలను కలెక్టరేట్‌లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అందించగా ఆయన కొద్దిదూరం వాహనం నడిపారు. మాధారం డోలమైట్ మైన్ డీజీఎం, ఇన్‌చార్జ్ బీ.యూ.వీ.ఎన్.రాజు మాట్లాడగా డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, ఆర్ ఐఎన్‌ఎల్ ఉద్యోగి పి.చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు.
తాగు, సాగునీటికి ఇబ్బందులు రావొద్దు


