కాసులే ముఖ్యం
తనిఖీలు మరిచిన అధికారులు
ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం
బస్సుల్లో పరిమితికి మించి తీసుకెళ్తున్న వైనం
తనిఖీల మాటెత్తని రవాణా శాఖ
కాలం
చెల్లినా..
ఖమ్మంక్రైం: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సుల విషయంలో నిబంధనలు పాటించడం లేదు. కాలం చెల్లిన బస్సులను పక్కన పెట్టకుండా వాటిలోనే పిల్లలను తీసుకెళ్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అంతేకాక కాసుల కక్కుర్తితో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పాఠశాలకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళనగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లాలో 813 స్కూల్ బస్సులు
అధికారిక లెక్కల ప్రచారం జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు 813 బస్సులు ఉన్నాయి. ఏటా జూన్‌కు ముందు ఖమ్మం, వైరా, సత్తుపల్లి రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో వీటిని తనిఖీ చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ఏడాది మాత్రం 764 బస్సులకే ఫిట్‌నెట్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తెలిసింది. దీంతో మిగిలిన బస్సులను వాడడం లేదా, కాలం చెల్లినా పిల్లలను తరలిస్తున్నారా అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు.
నిబంధనలకు మంగళం
పెనుబల్లి మండలం గణేషన్‌పాడు సమీపాన వివేకానంద విద్యాలయం బస్సు శుక్రవారం బోల్తా పడింది. ఇదేరోజు అశ్వాపురం మండలం మొండికుంట వద్ద కేఎల్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా కొట్టింది. వివేకానంద విద్యాలయం బస్సు బోల్తా పడిన సమయాన అందులో 107 మంది పిల్లలు ఉండడం గమనార్హం. బస్సు ఫీజు అదనంగా వసూలు చేసే యజమానులు అందుకు సరిపడా బస్సులు సమకూర్చకుండా కొన్నింట్లోనే లెక్కకు మిక్కిలిగా తరలిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు రెండు ఘట నలు జరగడం అటు విద్యాసంస్థల యాజమాన్యాలు, అధి కారుల నిర్లక్ష్యం తేటతెల్లం చేశాయి. అయితే, కొందరు విద్యాసంస్థల యజమానులు బస్సుల విషయంలో నిబంధనలు పాటించకుండా రాజకీయ నాయకుల పైరవీలతో రవాణాశాఖ అధికారులను మచ్చిక చేసుకుంటున్నారని సమాచారం. కొన్ని బస్సులకు ఫిట్‌నెస్ లేకపోగా, అనుభ వం లేనిడ్రైవర్లను నియమించడం, వారిలో కొందరు మద్యం మత్తులో వస్తున్నా పట్టించుకోకపోవడమే ప్రమాదాలకు కారణమవుతోందని చెబుతున్నారు.
స్కూల్ బస్సులను ఏటా జూన్‌కు ముందు రవాణా శాఖ అదికారులు పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయడమే కాక ప్రతీనెల ఒకసారి తనిఖీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం తప్ప మిగతా సమయాల్లో అధికారులు తనిఖీల మాటే ఎత్తడం లేదు. ఇక కొందరు డ్రైవర్లు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి కానరావడం లేదు. బస్సు ఫీజు పేరిట వేలాది రూపాయలు వసూలు చేసే యాజమాన్యాలు కక్కుర్తితో ఒకే బస్సులో వంద మంది చొప్పున తరలిస్తుండడంతో అనుకోని ఘటన జరిగితే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశముంది. అయినా, అటు యాజమాన్యాలు.. ఇటు అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
కాసులే ముఖ్యం


