ఇంట్లో భారీపేలుడు
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం 300మీటర్ల దూరం వరకు వినబడగా, ఇంటి సీలింగ్ పెచ్చులు ఊడిపోవడంతో కిటికీలు, అద్దాలు ధ్వంసం కావడమే కాక గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఖమ్మం బైపాస్‌లోని ఓ ఇంట్లో నివాసముండున్న మాదాల నారయణరావు – రమ దంపతులకు కుమారుడు స్నేహన్ చౌదరి ఉన్నాడు. హైదరాబాద్‌లో చదువుతున్న ఆయన సెలవులకు వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు రమ వంట చేసేందుకు స్టౌ వెలిగిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. దీంతో నిద్రలో ఉన్న నారాయణరావు, స్నేహన్ వచ్చేసరికి రమ దుస్తులకు మంటలు అంటుకోవడమే కాక పైకప్పు సీలింగ్ ఊడిపడుతోంది. అంతేకాక శబ్దానికి చుట్టుపక్కల వారు రావడంతో నారాయణరావు కుటుంబీకులు బయటకు పరుగులు తీశారు. అప్పటికే రమ శరీరం కొంత మేర కాలగా ఆమె భర్త, కుమారుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు.
ఏం జరిగింది?
ఇంట్లో పేలుడు ఎలా జరిగిందో అగ్ని మాపక శాఖ, పోలీసు సిబ్బంది అంచనా వేయలేకపోతున్నారు. గ్యాస్ సిలిండర్లు పేలకపోగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగలేదని గుర్తించారు. అయితే, ఫ్రిజ్‌లో గ్యాస్ లీకేజీతో పేలుడు జరిగి ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ, కార్కొపరేటర్ శీలంశెట్టి వీరభద్రం తదితరులు చేరుకుని పరిశీలించారు. అయితే, భారీ పేలుడులో రూ.10లక్షల మేర ఆస్తినష్టం జరిగినా కుటుంబీకులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రెండు రోజుల్లో 250మంది కేసులు
ఖమ్మంక్రైం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధ, గురువారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న 250మందిపై కేసు నమోదు చేయగా, ఇందులో ఖమ్మంకు చెందిన 76మంది ఉన్నట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీని వాసులు తెలిపారు. కేసు నమోదైన వారిపై కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, మద్యం సేవించి తనిఖీల్లో పట్టుబడిన వారికి జైలుశిక్షతో జరిమానా విధించే అవకాశముందని తెలిపారు.
గాయాలతో బయటపడిన కుటుంబీకులు


