
వెయిటింగ్ రూమ్ వద్ద సూచనలు చేస్తున్న కలెక్టర్ గౌతమ్
● లోక్‌సభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ ● ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ● ఖమ్మం కలెక్టరేట్‌లోని ఆర్‌ఓ కార్యాలయంలో ఏర్పాట్లు ● ముహూర్తాలు చూసుకుంటున్న అభ్యర్థులు ● నేడో, రేపో అభ్యర్థిని ప్రకటించనున్న కాంగ్రెస్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ గురువారం మొదలుకానుంది. ఇదేరోజు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. ఖమ్మం లోక్‌సభ స్థానంలో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ పలుమార్లు సమీక్షించారు. కలెక్టరేట్‌లోని ఆర్‌ఓ కార్యాలయంలో గురువారం నుంచి ఈనెల 25వరకు ఉదయం 11నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. కాగా, ఈనెల 26న స్క్రూటినీ చేయనుండగా, 29 వరకు ఉపసంహరించుకునే వీలుంది. ఆపై మే 13న పోలింగ్ నిర్వహంచి జూన్ 4న ఫలితం వెల్లడిస్తారు.
అంతా సిద్ధం..
ఖమ్మం కలెక్టరేట్‌లోని ఆర్‌ఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థుల కోసం లోక్‌సభ పరిధి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏఆర్‌ఓ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. అక్కడ నామినేషన్ పత్రాలు అందుబాటులో ఉంచడంతో పాటు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు. కాగా, నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థికి సంబంధించిన మూడు వాహనాలను మాత్రమే కలెక్టరేట్ లోపలికి అనుమతిస్తారు. మిగిలిన వాహనాలను 100 మీటర్ల దూరంలో నిలిపివేస్తారు. నామినేషన్ పత్రం ఫారం–2 ఏతో పాటు అఫిడవిట్‌ను ఫారం–26లో సమర్పించాలి. ఈ రెండు ఫారాలు పూర్తిగా నింపాలని ఇప్పటికే పార్టీల ప్రతినిధులకు సూచించారు.
జనరల్ అభ్యర్థులు రూ.25 వేలు..
ఎన్నికల ఖర్చు నిమిత్తం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఓటరు కాకపోతే వారి నియోజకవర్గ పరిధి ఎన్నికల నమోదు అధికారి నుంచి ధ్రువపత్రం సమర్పించాలి. జాతీయ, రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి ఒక ప్రతిపాదకుడు, గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకై తే పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. బలపరిచే వారు తప్పనిసరిగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వారై ఉండాలి. ఇక జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి.
ముహూర్తంతో ముందుకు..
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావును ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేడో, రేపో అభ్యర్థిని ప్రకటించనుంది. ఈమేరకు బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అలాగే, మంచి ముమూర్తం చూసుకుని నామినేషన్ దాఖలకు సిద్ధమవుతున్నారు. బీజేపీ అభ్యర్థి వినోద్‌రావు ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించగా.. కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు డాక్టర్ లక్ష్మణ్ హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. ఇక బీఆర్‌ఎస్ అభ్యర్థి ఈనెల 24న నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
అనుమతుల కోసం.
ఎన్నికల ప్రచారం, ర్యాలీల అనుమతి కోసం ఎన్నికల సంఘం సువిధ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా పార్టీలు నాయకులు 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సువిధ యాప్ ద్వారా సాధ్యం కాకపోతే ఏఆర్‌ఓ కార్యాలయంలో అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటారు. ఇక 85 ఏళ్లు దాటిన వారికి హోం ఓటింగ్ సౌకర్యం కల్పించగా.. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 2,466 మందిని అర్హులుగా గుర్తించారు.
ఓటర్లు 16,26,427 మంది
ఈనెల 16న ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 16,26,427 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, ఈనెల 25న వెలువరించే తుది జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించనుండగా ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. కాగా, ప్రస్తుతం ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్లలోపు ఉన్న యువత 49,393 మంది(3.04 శాతం) ఉండగా.. వీరు లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదే వయస్సు వారి నుంచి అందిన దరఖాస్తులు మరో 1,465 పెండింగ్ ఉన్నాయి.
పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ
ఖమ్మం సహకారనగర్: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభం కానుండగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, పోటీ చేసే అభ్యర్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే, పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులు పరిష్కరించాలని, ముందస్తుగానే ఓటరు స్లిప్పుల పంపిణీ చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ జిల్లా అధికారులతో సమావేశమై నామినేషన్ల స్వీకరణ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఆతర్వాత హెల్ప్ డెస్క్, వద్ద సౌకకర్యాలు, ధర్నా చౌక్ వద్ద ఏర్పాటుచేస్తున్న మీడియా పాయింట్‌ను పరిశీలించారు. అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్ నాయక్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మ్రినాల్ శ్రేష్ఠ, డీఆర్వో రాజేశ్వరి, జిల్లా సహకార అధికారి మురళీధర్‌రావు, జిల్లా ఉపాధికల్పన అధికారి కె.శ్రీరామ్, ఆర్డీఓ జి.గణేష్, ఉద్యోగులు అరుణ, మదన్‌గోపాల్, మీనన్, సత్యనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.