
పుష్పవతి మృతదేహం
ఖమ్మం సహకారనగర్: లోక్‌సభ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ఎస్.కే.అఫ్జల్‌హసన్, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఆర్.వీ.సాగర్ ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించారని ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో విచారణ అనంతరం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వీ.పీ.గౌతమ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దంపతుల ఆత్మహత్యాయత్నం
ఇంట్లోనే భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం
కల్లూరు: కల్లూరు పట్టణానికి చెందిన దంపతులు మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్ప డ్డారు. వీరిలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. బియ్యం వ్యాపారి చల్లా నర్సింహరావు, ఆయన భార్య పుష్పవతి(40) ఇంట్లోనే పురుగుల మందు తాగారు. హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తె, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పావని, బీటెక్ పూర్తి చేసిన మరో కుమార్తె కావ్య పలుమార్లు ఫోన్ చేసినా తల్లిదండ్రులు స్పందించకపోవడంతో చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. దీంతో ఇరుగుపొరుగు వచ్చి చూడగా పుష్పవతి అప్పగికే మృతి చెంది ఉండగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నర్సింహారావును ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఎస్‌కే.షాకీర్ చేరుకుని వివరాలు ఆరా తీశారు. అయితే, ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.
చేతబడి పేరిట ఇద్దరిపై దాడి
పెనుబల్లి: మండలంలోని పార్థసారధిపురంలో చేతబడి చేశారంటూ ఇద్దరిపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన కుంజ శివ దినకర్మ కార్యక్రమానికి అదే గ్రామానికి చెందిన బండి రాములు, పద్యం బాబురావు మంగళవారం వెళ్లారు. అయితే, వీరు చేతబడి చేయడంతోనే శివ చనిపోయాడంటూ ఆయన బంధువులు సున్నం పోతమ్మ, కుంజా రాములు, కుంజా వెంకటేష్, కుంజా లక్ష్మి, కుంజా జయమ్మ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టడంతో పాటు చేతుల్లో నిప్పులు పోసి, దంతాలు ఊడపీకడానికి ప్రయత్నించారని బాధితులు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అకౌంట్లు హ్యాక్ చేసి
నగదు స్వాహా
పెనుబల్లి: మండలంలోని వీఎం.బంజర్ గ్రామానికి చెందిన కొణిజేటి తిరుపతిస్వామి ఫోన్‌కు లింక్ అయిన రెండు అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు నగదు స్వాహా చేశారు. తిరుపతిస్వామి రెండు అకౌంట్లను హ్యాక్ చేసి రూ.1.80 లక్షలు నేరగాళ్లు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.