శ్రీవారు, అమ్మవార్లకు కల్యాణ అలంకరణ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారు, అమ్మవార్లకు కల్యాణ అలంకరణ

Apr 14 2024 12:55 AM | Updated on Apr 14 2024 12:55 AM

చెక్‌పోస్టులో రికార్డులు పరిశీలిస్తున్న 
అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ - Sakshi

చెక్‌పోస్టులో రికార్డులు పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఐదో రోజైన శనివారం కొనసాగాయి. ఈసందర్భంగా అర్చకులు శ్రీవారికి సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకాలు చేశాక స్వామి వారిని పెళ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించడంతో భక్తులు దర్శించుకున్నారు. అలాగే, స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించడంతో గజ వాహనంపై గిరిప్రదక్షణ చేయించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్‌ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్‌ విజయకుమారి, అర్చకులు ఉప్పల విజయదేవశర్మ, మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

కొత్త ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించండి

ఖమ్మం సహకారనగర్‌: సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)–2 పరీక్షలు ఈనెల 15న మొదలుకానుండగా, తెలుగు, హిందీ పరీక్షలు కొత్త ప్రశ్నాపత్రాలతోనే నిర్వహించాలని డీఈఓ సోమశేఖరశర్మ సూచించారు. కొణిజర్ల మండలంలోని మేరీ ఇమ్మాక్యులేట్‌ పాఠశాలలో ముందుగానే తెలుగు, హిందీ పరీక్షలు నిర్వహించారని పేర్కొన్నారు. దీంతో ఈ రెండు సబ్జెక్టులకు కొత్తగా ప్రశ్నాపత్రాలు ముద్రించినందున అన్ని పాఠశాలల్లో వీటితోనే నిర్వహించాలని డీఈఓ సూచించారు. కాగా, ముందుగా పరీక్షలు నిర్వహించిన మేరీ ఇమ్మాక్యులేట్‌ యాజమాన్యానికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

విజయవాడ–కొత్తగూడెం ప్యాసింజర్‌ రైలు పునరుద్ధరణ

కారేపల్లి: విజయవాడ–భద్రాచలం రోడ్డు(కొత్తగూడెం), భద్రాచలం రోడ్డు–విజయవాడ మధ్య ప్యాసింజర్‌ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం పునఃప్రారంభించారు. ఈ రైళ్లను 21వ తేదీ వరకు నడిపిస్తామని ప్రకటించారు. విజయవాడలో మొదలుకానున్న ప్యాసింజర్‌ రైలు ఖమ్మం, డోర్నకల్‌, కారేపల్లి మీదుగా కొత్తగూడెం(భద్రాచలం రోడ్డు) వర కు నడుస్తుంది. తిరిగి కొత్తగూడెంలో మొదలై ఇదే మార్గం ద్వారా విజయవాడ చేరుకుంటుంది. ప్యాసింజర్‌ రైలును ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉండడంతో పలువురు హర్షం చేస్తున్నారు. ఇదే మా దిరి కరోనా సమయాన నిలిపేసిన అన్నిరైళ్లను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

ఎన్నికల ఏర్పాట్లపై

అదనపు కలెక్టర్‌ సమీక్ష

సత్తుపల్లి: లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ డి.మధుసూదన్‌నాయక్‌ సత్తుపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో సమీక్షించారు. నియోజకవర్గంలోని తహసీల్దార్లతో శని వారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలకు సువిధ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేలా అవగా హన కల్పించాలని సూచించారు. అలాగే, ఫిర్యాదు చేసేందుకు సీ విజిల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలని, పోలింగ్‌ స్టేషన్లలో కనీస వసతులు, గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువగా పోలింగ్‌ అయిన కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ తెలిపారు. ఆతర్వాత ఆయన గంగారంలోని సరిహద్దు చెక్‌పోస్టును తనిఖీ చేశారు. తహసీల్దార్లు యోగీశ్వరరావు, ఎంఏ.రాజు, జి.ప్రతాప్‌, డి.సాంబశివు డు, వి.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన జెడ్పీటీసీ

రఘునాథపాలెం: రఘునాథపాలెం జెడ్పీటీసీ సభ్యురాలు మాలోత్‌ ప్రియాంక శనివారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షాన కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ తరఫున ప్రియాంక గెలవగా.. మండలంలోని సుకినీ తండాలో ఆమెకు మంత్రి తుమ్మల, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు ఎం.డీ.జావీద్‌, కార్పొరేటర్లు మలీదు జగన్‌, వెంకటేశ్వర్లు, ఎంపీపీ గౌరితో పాటు లకావత్‌ సైదులు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, తారాచంద్‌, బోయిన లక్ష్మణ్‌గౌడ్‌, కొంటెముక్కల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మంత్రితో జెడ్పీటీసీ, ఎంపీపీ తదితరులు1
1/1

మంత్రితో జెడ్పీటీసీ, ఎంపీపీ తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement