
శ్రీవారి పాదానికి అభిషేకం చేస్తున్న అర్చకులు
● జమలాపురంలో కొనసాగుతున్న
బ్రహ్మోత్సవాలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం శ్రీవారికి అర్చకులు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం పరమ పవిత్రమైన శ్రీస్వామి వారి పాదాలకు పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించి పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా కలశ పూజ చేశారు. శ్రీఅలివేలు మంగ అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమార్చన, పుష్పార్చన నిర్వహించారు. శ్రీవారికి పల్లకీ సేవ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు శ్రీవారిని, అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులు సమర్పించారు. శ్రీ పద్మావతి, శ్రీ అలివేలుమంగ సమేతుడైన స్వామివారిని గజ వాహనంపై ఊరేగించగా, భక్తులు, గ్రామస్తులు కోలాటాలతో గిరి ప్రదక్షణ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు విజయదేవశర్మ, మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
పర్ణశాలను సందర్శించిన
దేవనాద జీయర్ స్వామి
దుమ్ముగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతా రామచంద్ర స్వామివారిని శ్రీశ్రీశ్రీ దేవనాద రామానుజ జీయర్ స్వామి శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించి తీర్థప్రసాదాలను అందచేశారు. ఆలయ అధికారి అనిల్‌కుమార్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం దుమ్ము గూడెంలోని శ్రీఅత్మ రామచంద్ర స్వామివారి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: శ్రీదేవి వసంత నవరాత్రోత్సవల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం పెద్దమ్మతల్లికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు 108 కలశాలతో పంచామృతాభిషేకం, నాదనీరాజనం, శ్రీచక్రార్చన, సూర్యనమస్కారాలు, సూక్తపారాయణం, చండీసప్తసతీ పారాయణం, హోమాలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష కుంకుమార్చన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం తదితర పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఈఓ సుదర్శన్, భక్తులు పాల్గొన్నారు.