
గృహజ్యోతి కింద జారీ చేసిన జీరో బిల్లు
● జిల్లాలో 2.36 లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ ● ఎన్నికల కోడ్‌తో సవరణలకు బ్రేక్ ● 200 యూనిట్లు దాటితే బిల్లు కట్టాల్సిందే.. ● మరుసటి నెల తగ్గితే ‘జీరో’ బిల్లు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో గృహజ్యోతి పథకం కింద నెలకు రూ.6.69 కోట్ల విలువైన విద్యుత్‌ను వినియోగదారులకు ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు సంస్థ గుర్తించింది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి వచ్చాక ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో అనుసంధానమైన విద్యుత్ కనెక్షన్లకు ఉచిత పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 4,27,171 ఉండగా.. ఇందులో 3,55,905 కనెక్షన్ల వినియోగదారులు గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటిని ఎన్పీడీసీఎల్ ద్వారా సర్వే చేయించగా.. అర్హులైన వినియోగదారుల రేషన్ కార్డులు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లను విద్యుత్ కనెక్షన్‌కు అనుసంధానం చేశారు. ఆపై నెలకు 200 యూనిట్ల విద్యుత్ వినియోగించే సర్వీసులకు గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేశారు.
ఫిబ్రవరి నుంచి ప్రారంభం..
ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద 2,36,166 విద్యుత్ సర్వీసులను గుర్తించారు. వీటికి అదేనెల 2వ తేదీ నుంచి ‘జీరో’ బిల్లులను జారీ చేయడం ప్రారంభించారు. ఈ మొత్తం సర్వీసులు ఫిబ్రవరిలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించగా.. దాని విలువ రూ.6.69 కోట్లుగా తేలింది. ఈ నిధులను ప్రభుత్వం విద్యుత్ సంస్థకు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ప్రభుత్వం పథకం అమలుకు ముందుగానే రూ.200 కోట్లు కేటాయించగా.. ఏ నెలకానెల వినియోగించే గృహజ్యోతి పథకం కనెక్షన్ల బిల్లులను ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది.
సవరణలకు విరామం..
గృహజ్యోతి పథకంలో అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి నుంచి గృహజ్యోతి పథకం అమలవుతున్నా.. పలువురు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించకపోవటం, సమర్పించినా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవటంతో వారికి పథకం వర్తించడం లేదు. దీంతో మార్చి ఆరంభంలో ప్రభుత్వం మరోమారు దరఖాస్తుల స్వీకరణకు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇంతలోనే ఎన్నికల కోడ్ రాగా.. ప్రక్రియ నిలిచిపోయింది. ముందుగానే గుర్తించిన అర్హులైన వారి కనెక్షన్లకు మార్చిలో కూడా జీరో బిల్లులు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత తిరిగి గృహజ్యోతికి దరఖాస్తుల స్వీకరణ, వర్తింపు కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది.
ఆందోళన వద్దు..
తెల్ల రేషన్ కార్డు కలిగి, నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి గృహజ్యోతి వర్తించేలా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ఫిబ్రవరి నుంచి అమలవుతుండగా.. ప్రస్తుతం వేసవి కావడంతో ఉక్కపోత నుంచి రక్షించుకునేందుకు ప్రతీ ఇంట్లో ఫ్యాన్లు, కూలర్ల వినియోగం తప్పనిసరైంది. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతుండగా మార్చిలో జీరో బిల్లు వచ్చిన వారికి ఈనెల 200 యూనిట్లు దాటడంతో అలా రాలేదు. ఈ విషయమై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యాన అధికారులు స్పష్టత ఇచ్చారు. ఏదైనా కారణాలతో 200 యూనిట్లు దాటితే బిల్లు వస్తుందని, ఆ మరుసటి నెల వినియోగం తగ్గితే జీరో బిల్లే వస్తుందని పేర్కొన్నారు. అంతే తప్ప ఒక నెల వినియోగం పెరిగింత మాత్రాన పూర్తిగా తొలగించాలనే నిబంధన ఏదీ లేదని తెలిపారు.