గులాబీ సత్తా చాటండి | - | Sakshi
Sakshi News home page

గులాబీ సత్తా చాటండి

Published Mon, Nov 20 2023 12:06 AM | Last Updated on Mon, Nov 20 2023 12:06 AM

- - Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఎవరికి వారు తామే అభ్యర్థులుగా భావించి రాబోయే పది రోజులు కష్టపడాలని, జిల్లాలో ఈ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలంలో ఆదివారం ఆయన రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిరంతర విద్యుత్‌, తాగు, సాగునీరు, సంక్షేమం, సింగరేణి పరిరక్షణ కావాలంటే ఇక్కడ వనమా గెలవడం, రాష్ట్రంలో కేసీఆర్‌ సీఎం కావడం అనివార్యమని అన్నారు. జిల్లాలో కొన్నిచోట్ల పోడుభూముల సమస్య ఉందని, దాన్ని కూడా పరిష్కరిస్తామని అన్నారు. అంబ సత్రం భూముల సమస్య పరిష్కరించడంతో పాటు గిరిజనేతరులకూ పోడుపట్టాలు అందజేస్తామని అన్నారు. 1/70 సమస్యపై కూడా సీఎం కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రేగళ్ల రైతుల సమస్య, పెండింగ్‌లో ఉన్న విమానాశ్రయ సాధన వంటి వాటికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇల్లెందు: ‘రాష్ట్రంలో 11 సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ 45 ఏళ్లు పాలించింది. ఇన్నాళ్లూ ఏమీ చేయకుండా ఇప్పుడు మరో చాన్స్‌ ఇవ్వాలని అంటోంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే నాయకులు స్కాములు చేస్తారు.. రాష్ట్రాన్ని మింగుతారు’ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. ఇల్లెందు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ హరిప్రియ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం జగదాంబా సెంటర్‌లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఎన్నికలంటే ఆగం కావొద్దని, జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమ మోదీకి లేదన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కోసం రాహుల్‌గాంధీ ఏనాడూ పార్లమెంట్‌లో మాట్లాడలేదన్నారు. సింగరేణి లాభాల్లో బోనస్‌ ఇప్పించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. స్థానిక పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు, అలకలు ఉన్నా అన్నీ సర్దుకుంటాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరిప్రియను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. హరిప్రియ మరోసారి ఎమ్మెల్యే కాగానే, రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తామని, అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్‌ మంత్రిగా ఉన్న తనతో సోదరి హరిప్రియ కొట్లాడి నిధులు తెచ్చుకుని ఇల్లెందు మున్సిపాలిటీని అభివృద్ధి చేసిందని చెప్పారు. పూసపల్లి ఓసీతో కార్మికులను తరలిస్తారనే అపోహ అవసరం లేదని, ఏ ఒక్కరినీ ఇక్కడి నుంచి తరలించబోమని అన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల కలలను నెరవేర్చుకున్నామని, బస్‌ డిపో, 100 పడకల ఆస్పత్రి, సీసీ రోడ్లు, సీతారామ ప్రాజెక్టును సాధించుకున్నామని తెలిపారు. ఈ ప్రాంత గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌ వారి జీవితాలను మార్చారని కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ అధికారంలోకి రాగానే కొమురారం, బోడు మండలాలు ఏర్పాటు చేయాలని, ఇల్లెందును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. ఇవన్నీ కావాలంటే వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీలు మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, నాయకులు దిండిగాల రాజేందర్‌, మడత వెంకట్‌గౌడ్‌, ఊకె అబ్బయ్య, భాస్కర్‌ నాయక్‌, వెంకటప్రవీణ్‌నాయక్‌, జానీపాషా తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ తామే అభ్యర్థులుగా భావించాలి

అన్ని స్థానాల్లోనూ విజయానికి

కార్యకర్తలు కృషి చేయాలి

సింగరేణిని రక్షించేది

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

తెలంగాణ తొలి ఉద్యమానికి

కొత్తగూడెమే నాంది

రోడ్‌షో, కార్నర్‌ మీటింగుల్లో

ఐటీ మంత్రి కేటీఆర్‌

స్కాములతో

రాష్ట్రాన్ని మింగేస్తారు..

కాంగ్రెస్‌ నేతలపై మంత్రి కేటీఆర్‌ విమర్శ

హరిప్రియను గెలిపించాలని పిలుపు

వనమా చెప్పింది జీవిత సత్యం

కేసీఆర్‌ చేతుల్లోనే ఈ రాష్ట్ర భవిష్యత్‌ సుభిక్షంగా ఉంటుందని సీనియర్‌ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు చెప్పిన మాటలు జీవిత సత్యమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సర్పంచ్‌ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగిన నాయకుడు వనమా అన్నారు. 50 ఏళ్ల రాజకీయ అనుభంతో వనమా ఈ మాటలు అన్నారని కేటీఆర్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement