ఖమ్మం : మాకు టీచర్లు కావలెను

సత్తుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు - Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత

బడులు ప్రారంభమై మూడు వారాలు గడిచినా అదే పరిస్థితి

గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్వని అధికారులు

ఖమ్మం సహకారనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదంతా బాగానే ఉన్నా ఉపాధ్యాయుల నియామకంలో మాత్రం అడుగు పడడం లేదు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడగా.. ఈ ఏడాది సౌకర్యాలు మెరుగుపడ్డాయి. కానీ ఉపాధ్యాయులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బోధన చురుగ్గా సాగడం లేదని తెలుస్తోంది. విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి ఉపాధ్యాయులను నియమించడమా లేదంటే విద్యావాలంటర్లను ఎంపిక చేయడం జరిగితే విద్యార్థులకు మేలు జరిగేది.

భారీగానే ఖాళీలు

జిల్లాలోని 21 మండలాల పరిధిలో 1216 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింట్లో 5,759మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాల్సి ఉంది. కానీ 974పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. ఇందులో సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు 515మంది, ఎస్‌ఏలు 323మంది, ఇతర ఉపాధ్యాయులు 136మంది లేక బోధన కుంటుపడుతోంది. పాఠశాలల నిర్వహణలో కీలకమైన హెచ్‌ఎంలతో పాటు గణితం, బయాలజీ, సోషల్‌ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తోంది.

చేదు అనుభవాలు ఉన్నా..

కీలకమైన సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో ఏటా సర్దుపాటు ప్రక్రియ చేపడుతున్నారు. గత ఏడాది మొదట్లో సర్దుబాటు చేయకుండా విద్యా సంవత్సరం సగంలో చేపట్టడంతో బోధన అంతంత మాత్రంగానే సాగింది. ఫలితంగా ఎస్సెస్సీలో మెరుగైన ఫలితాలు నమోదు కాలేదు. అయినప్పటికీ ఈసారి కూడా అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఇలా..

 • గ్రేడ్‌–2 హెచ్‌ఎం 81
 • ఎస్‌ఏ సోషల్‌ 166
 • ఎస్‌ఏ బయాలజీ 110
 • ఎస్‌ఏ మ్యాథ్స్‌ 59
 • ఎస్‌ఏ తెలుగు 44
 • ఎస్‌ఏ ఇంగ్లీష్‌ 26
 • ఎస్‌ఏ హిందీ 24
 • ఎస్‌ఏ ఫిజిక్స్‌ 05
 • ఎస్‌జీటీలు 323
 • ఇతర ఉపాధ్యాయులు 136
 • మొత్తం 974

కీలక సబ్జెక్టులకు టీచర్లే లేరు..

కీలక సబ్జెక్టులైన గణితం, సైన్స్‌, సోషల్‌, ఇంగ్లిష్‌ బోధించే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వం, అధికార యంత్రాంగం భర్తీ చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో విద్యావలంటీర్ల ద్వారా కొద్దిలో కొద్దిగా బోధన సాగించగా.. వారిని సైతం మూడేళ్ల క్రితం తొలగించారు. ఆ తర్వాత కొత్త నియామకాలు చేపట్టకపోవటం, విద్యావలంటీర్ల రెన్యువల్‌ లేకపోవటంతో గతేడాది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఈ ఏడాది అటు వీవీలను నియమించకపోగా, సర్దుబాటుపై కూడా దృష్టి సారించకపోవడం గమనార్హం.

రెండు రోజుల్లో సర్దుబాటు

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు సర్దుబాట్లు చేస్తున్నాం. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూస్తాం.

– సోమశేఖరశర్మ, జిల్లా విద్యాశాఖాధికారి

ఉపాధ్యాయుల కొరత తీర్చాలి

పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాల్సిన అవసరముంది. పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించామని చెబుతున్నా వంద శాతం పనులు కాలేదు. మరోపక్క ఉపాధ్యాయులు లేనందున నియామకాలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి.

– వెంకటేష్‌, జిల్లా కార్యదర్శి, పీడీఎస్‌యూ

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top