బళ్లారి టౌన్: పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని మేయర్ పి.గాదెప్ప పేర్కొన్నారు. మంగళవారం నగరంలో జోళదరాశి దొడ్డనగౌడ మందిరంలో జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, కన్నడ సాంస్కృతిక శాఖ చేపట్టిన రెండు రోజుల జిల్లా స్థాయి కళా ప్రతిభోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గ్రామీణ, నగర ప్రాంతాల్లో పిల్లల్లో కళా ప్రతిభను గుర్తించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. పిల్లలు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్యారంటీ పథకాల అనుష్టం ప్రాధికారం అధ్యక్షుడు కేఈ చిదానందప్ప మాట్లాడుతూ.. పిల్లలు చిన్న వయస్సులో నుంచే సంగీత నృత్య, నాటకం తదితర కళల్లో సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో కన్నడ సాంస్కృతిక శాఖ ఏడీ నాగరాజ్, సంధ్యా రావు, జిలాని బాష, ప్రకాశ్ జైన్, పరశురామ్, మారుతీ రావు, తదితరులు పాల్గొన్నారు.


