లారీ నిర్లక్ష్యం.. కారు నుజ్జు | - | Sakshi
Sakshi News home page

లారీ నిర్లక్ష్యం.. కారు నుజ్జు

Nov 25 2026 3:36 AM | Updated on Nov 25 2026 3:36 AM

మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నంలో లారీ అడ్డు రావడంతో కారు ఢీకొన్న ఘోర ప్రమాదంలో తాతా, మనవరాలు మరణించారు. తాలూకాలోని నాగవనహళ్లి గేటు సమీపంలో బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వేపై ఉన్న ఓవర్‌హెడ్‌ బ్రిడ్జిపై సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతులను మండ్య జిల్లా గుత్తలు బ్లాక్‌కు చెందిన మహాదేవ్‌ (49), అతని మనవరాలు రిత్విక (8)గా గుర్తించారు. కారు నడుపుతున్న శివరాజు, గౌరీ, మహాదేవ్‌ భార్య లత, ప్రథవ్య అనే మరో యువతి తీవ్రంగా గాయపడ్డారు. వారిని మైసూరులోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు.

హఠాత్తుగా లేన్‌ మారడంతో..

కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం రాత్రి నంజనగూడులోని శ్రీకంఠేశ్వర ఆలయానికి వెళ్తున్నారు. సరుకులతో ముందు వెళ్తున్న కేరళ రాష్ట్ర ప్రభుత్వ లారీ డ్రైవరు హఠాత్తుగా ఎడమ లేన్‌ నుంచి కుడి లేన్‌లోకి మళ్లించాడు. దీంతో వెనుక వస్తున్న కారు లారీని ఢీకొని నుజ్జయింది. శ్రీరంగపట్న గ్రామీణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

జాతరకు వెళ్లి అనంతలోకాలకు..

యశవంతపుర: ఉడుపి జిల్లా బైందూరు తాలూకా శిరూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. ఉప్పంద జనతా కాలనీకి చెందిన అభిషేక్‌ ఖార్వి (23), ప్రవీణ్‌ ఖార్వి (23), ఉప్పందలో జరిగిన కోడి పండుగ చూడడానికి బైక్‌లో వెళ్లారు. సోమవారం రాత్రి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో జారిపడ్డారు. దీంతో తీవ్ర గాయాలై మృతి చెందారు. ప్రవీణ్‌ బెంగళూరులో పని చేస్తుండగా, అభిషేక్‌ ఊళ్లోనే జాలరిగా ఉండేవాడు. ఇద్దరు దగ్గర బంధువులని తెలిసింది. జాతరకు వెళ్లినవారు తిరిగి రాని లోకాలకు పోయారని తెలిసి తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు. బైందూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

బర్త్‌డేకు వస్తుంటే మృత్యువాత

తుమకూరు: జిల్లాలోని తిపటూరు తాలూకాలోని హొన్నవల్లి హోబ్లీలో ఆలూరు గేట్‌ వద్ద బైక్‌ను ఏదో వాహనం ఢీకొట్టడంతో, బైకిస్టు మృతి చెందాడు. తిపటూరు పట్టణం శంకర్‌ నగర నివాసి తేజస్‌ (24) మృతుడు. ఇతడు బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. తన బర్త్‌డే కావడంతో తల్లిదండ్రులను, స్నేహితులతో కలిసి కేక్‌ కట్‌ చేయాలని సంతోషంగా ఊరికి బయల్దేరాడు. ఘటనాస్థలిలో గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయాలై మరణించాడు. హొన్నవల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

తాత, మనవరాలు మృతి

నలుగురికి తీవ్ర గాయాలు

శ్రీరంగపట్నం వద్ద ఘోరం

బైక్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు దుర్మరణం

దొడ్డబళ్లాపురం: బీదర్‌ జిల్లా హులసూరు తాలూకా ముచళంబ గ్రామంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బసవ కళ్యాణపట్టణ నివాసులు బాబా (26), సమీర్‌ (22), రెహాన్‌ (12) బైక్‌లో వేరే ఊరికి వెళ్లి తిరిగి వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొంది. ముగ్గురూ తీవ్ర గాయాలై మరణించారు. బసవ కళ్యాణ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement