బైక్‌లు, లారీని కారు ఢీ.. ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌లు, లారీని కారు ఢీ.. ముగ్గురికి గాయాలు

Nov 25 2026 3:36 AM | Updated on Nov 25 2026 3:36 AM

మండ్య: మండ్య జిల్లాలోని భారతీనగర దగ్గర ఛాత్ర హోసహళ్లి గేట్‌ వద్ద ఒక కారు అదుపుతప్పి రెండు బైక్‌లను, ఒక లారీని ఢీకొట్టిన ప్రమాదంలో కారులోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మళవల్లి తాలూకాలోని భీమనకెరెకు చెందిన శివరాజు (38), మండ్య తాలూకావాసులు ప్రమోద్‌ (37), జయదేవ (37) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమోద్‌, జయదేవ, శివరాజు మద్దూరు నుంచి మాళవల్లి వైపు కారులో వెళ్తూ అదుపుతప్పి ముందు వెళ్తున్న 2 బైక్‌లను, మరో లారీని ఢీకొన్నారు. కారు నుజ్జు కాగా అందులోని ముగ్గురిని స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై ప్రయాణిస్తున్న కొల్లేగాలవాసులు రాజమ్మ (65), మహేంద్ర (23) స్వల్పంగా గాయపడ్డారు. మద్దూరు–మళవళ్లి హైవేపై అరగంటకు పైగా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

బన్నూరు కేసులో

ముగ్గురి సస్పెండ్‌

దొడ్డబళ్లాపురం: వీఏఓ పరీక్షల్లో శంకర్‌ బన్నూరు అనే అభ్యర్థి కాపీయింగ్‌ ద్వారా 151 మార్కులు సాధించి రాష్ట్రంలో టాపర్‌గా నిలిచిన కేసులో నిర్లక్ష్యం చూపిన ప్రిన్సిపాల్‌తో పాటు ముగ్గురిని హావేరి జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. పరీక్ష హాల్‌లో గూగుల్‌ లెన్స్‌ వాడి శంకర్‌ బన్నూరు సమాధానాలు తెలుసుకుంటూ పరీక్ష రాసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆ పరీక్ష కేంద్రం పర్యవేక్షకులు అయిన శిగ్గాంవి ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్‌ రమాకాంత్‌ భట్‌, ఇన్విజిలేటర్‌ బసవరాజు, లెక్చరర్‌ రాజును సస్పెండ్‌ చేశారు.

శిక్షణ పేరిట లైంగికదాడి

● గర్భం దాల్చిన బాలిక

కోలారు: వాలీబాల్‌ నేర్పిస్తానంటూ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడుతున్న ఓ కామాంధ కోచ్‌ గుట్టురట్టయింది. అతని దాష్టీకం వల్ల బాలిక గర్భం దాల్చింది. ఈ దురాగతం కోలారు జిల్లా బేతమంగల ఠాణా పరిధిలో జరిగింది. ఫిర్యాదు మేరకు వివరాలు.. స్థానికంగా ఓ విద్యార్థిని హైస్కూల్‌లో చదువుతోంది. ఆమె వాలీబాల్‌ నేర్చుకొంటూ ఉండగా కోచ్‌ శశికుమార్‌ మభ్యపెట్టి వాంఛలు తీర్చుకొంటున్నాడు. బాలిక కడుపునొప్పి అని చెప్పడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు గర్భిణి అని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. బాలల సంరక్షణ శాఖ అధికారులతో కలిసి బేతమంగల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు శశికుమార్‌ను అరెస్టు చేసి కటకటాలకు తరలించారు.

వరి పంటలు ఎండిపోవాలా?

● మైసూరులో కబిని ప్రాంత రైతుల ధర్నా

మైసూరు: పెరుగుతున్న తమ వరి పంట కు కాలువల నుంచి నీటిని ఇవ్వాలని కబిని ఆయకట్టు రైతులు మంగళవారం మైసూరులో ధర్నా చేశారు. గన్‌ హౌస్‌ ముందు గుమిగూడిన వందలాది మంది రైతులు, కావేరీ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్‌ మాట్లాడుతూ కరువుతో బాధపడుతున్న రైతులు, కబిని జలాశయం నిండటం చూసి వరి సాగు చేశారు, పంట బాగా ఉంది, కానీ ఇప్పుడు కాలువల్లో నీటి సరఫరా నిలిపివేయడంతో వరి ఎండిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. తక్షణమే కాలువలకు నీటితో వదలాలని డిమాండ్‌ చేశారు. కబినికి వచ్చిన నీటిని తమిళనాడుకు ఇచ్చేసి, మన రైతులను వీధిపాలు చేస్తారా? అని ప్రశ్నించారు.

తాగునీటి కోసమే

చీఫ్‌ ఇంజనీర్‌ సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ కబిని ప్రాజెక్టు నీటిని వచ్చే ఏప్రిల్‌ వరకు తాగునీటి కోసం ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత డిమాండ్లను నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. కావేరి సర్కిల్‌ ఇంజనీర్‌ రఘుపతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement