శివాజీనగర: ‘ఆశా కార్యకర్తల పట్ల నాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. మీ సమస్యను పరిష్కరిస్తాం. ఆందోళనను ఇక ఆపేయాలి‘ అని సీఎం డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. జపాన్‌లో ఆయన రైలులో ప్రయాణిస్తూ స్వతంత్ర పార్కులోని ఆశా కార్యకర్తల నాయకులతో వీడియో కాల్ ద్వారా చర్చించారు. మీ డిమాండ్లను నెరవేరుస్తానని చెప్పినా ధర్నా కొనసాగిస్తున్నారని సీఎం అన్నారు. మీ కోపం పతాక స్థాయికి చేరిందన్నారు. నేను మీ డిమాండ్లను ఆర్థిక శాఖతో చర్చిస్తాను, మీకు న్యాయం జరుగుతుంది అన్నారు. పగలూ, రాత్రి ఆందోళన చేస్తూ ఇబ్బంది పడొద్దన్నారు. జపాన్ నుంచి వచ్చాక మిమ్మల్ని కలుస్తానని తెలిపారు. కొందరు రాజకీయ నాయకుల్ని నమ్మి మోసపోవద్దన్నారు.
ఆశాల ఆగ్రహం
ఆశాల ఆందోళన 8వ రోజూ కొనసాగింది. తమను సీఎం డీకే సోదరీమణులు అనడాన్ని ప్రస్తావించారు. ‘మేము మా సోదరుని రాక కోసం ఎదురుచూస్తున్నాము. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాడు. మమ్మల్ని సోదరీమణులని పిలుచుకునే సీఎం.. ఆయన కూతుళ్లే ఇలా వీధుల్లో కూర్చుంటే మౌనంగా ఉంటారా? మా బాధ ఆయనకు అర్థం కాదా?’ అని ప్రశ్నించారు. చినుకులు పడడంతో తడవకుండా కవర్లు కప్పుకున్నారు.


