బొమ్మనహళ్లి: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా బెంగళూరులోని కగ్గదాసపుర హృదయస్పందన సంస్థ ఆధ్వర్యంలో కళ్యాణనగరలో శారదామాత ఆలయంలో చండీ హృదయ అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహించారు. 4 రోజుల నుంచి వేదపండితులు యజ్ఞం సాగిస్తుండగా, మంగళవారం 45కు పైగా హోమ ద్రవ్యాలను సమర్పించి సమాప్తం చేశారు. బాలికలను సరస్వతీ రూపాలుగా మహిళలు పూజలు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మాట మార్చేశారు!
యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మంగళవారం బెంగళూరు 59వ సీసీహెచ్ కోర్టులో విచారణ కొనసాగింది. హత్య జరిగిన ఆర్‌ఆర్ నగరలోని పట్టణగెరె షెడ్డులో పని చేస్తున్న మల్లికార్జునయ్య, అకౌంటెంటు విజయ్‌కుమార్‌లను జడ్జి విచారించారు. ఘటన జరిగిన రోజున తాము ఏమీ చూడలేదని వారు చెప్పారు. తాము పని చేసుకుంటూ ఉన్నామని, బయటకు రాలేదని అన్నారు. వీరిద్దరూ గతంలో పోలీసుల విచారణలో నిందితులను అక్కడ చూశామని చెప్పారు. ఇప్పుడు లేదనడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
మెట్రోలో హృదయ ప్రయాణం
బనశంకరి: బెంగళూరులో గురగుంటెపాళ్య మెట్రోస్టేషన్ నుంచి బొమ్మసంద్ర మెట్రోస్టేషన్ వరకు గుండెను వేగంగా తరలించారు. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన హృదయాన్ని ఓ రోగికి అమర్చడానికి తరలించారు. ఇందులో ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొనగా, మెట్రో సిబ్బంది సహకారం అందించారు. మంగళవారం మధ్యాహ్నం 12:20 గంటలకు బయల్దేరి 1:24 గంటలకు బొమ్మసంద్ర మెట్రోస్టేషన్ కు చేరుకున్నారు. తరువాత మరో కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెట్రోలో గుండెను తరలించడం ఇది 8వ సారి అని తెలిపారు.
మా జిల్లాల్లోకి ఏనుగులు వద్దు
యశవంతపుర: హాసన్ జిల్లాలో మకాం వేసిన ఏనుగులను అటవీ సిబ్బంది చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల వైపు మళ్లించడంపై ఆ జిల్లాల రైతులు, కన్నడ సంఘాల నాయకులు వ్యతిరేకత తెలిపారు. 47 ఏనుగులను ఇలా తోలడం సబబు కాదని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి ఎమ్మెల్యే జ్ణానేంద్ర అన్నారు. తీర్థహళ్లి, హొసనగర ప్రాంతాలలో ఏనుగులు పొలాల మీద పడి నాశనం చేస్తున్నాయన్నారు. ఎన్‌ఆర్ పుర వైపు కూడా ఏనుగులను తోలారన్నారు. శివమొగ్గ, తీర్థహళ్లి రైతులతో కలిసి అటవీశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. మూడిగెరె మీదుగా భద్రా అభయారణ్యంలోకి ఏనుగులను తరమడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నయన మోటమ్మ రాజీనామా చేయడం వల్ల ఉపయోగం లేదని కొందరు నాయకులు విమర్శించారు. ఈ రాజీనామా నాటకమని దుయ్యబట్టారు.


