శివాజీనగర: ‘నేను, మంత్రి ఎం.బీ.పాటిల్, 8 మంది అధికారులు జపాన్‌కు వెళ్తున్నాము. పట్టణాభివృద్ధి గురించి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జపాన్ వ్యాపారవేత్తల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా మేము ఈ విదేశీ పర్యటనను చేపట్టాము’ అని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన బెంగళూరులో తమ నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. జపాన్‌లో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫ్లై ఓవర్లను నిర్మించారని తెలిపారు. వాటిని ఇక్కడ కూడా నిర్మించే దిశగా అధ్యయనం చేస్తామన్నారు. రాష్ట్రంలో టయోటా కంపెనీ విస్తరణతో సహా పలు అంశాలపై తాము వివిధ జపనీస్ వ్యాపారవేత్తలతో చర్చలు జరుపుతామని తెలిపారు. కాగా, సీఎం, ఇతర బృందం బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి జపాన్‌కు బయల్దేరారు.
ఆశాలు నిరసన ఆపాలి
ఆశా కార్యకర్తలు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిరసనను విరమించుకోవాలని సీఎం కోరారు. మీ సమస్య మాకు తెలుసు, అందరూ సంయమనం పాటించాలని, మీకు సహాయం చేస్తానని చెప్పారు. మీతో గంటన్నర పాటు చర్చించానన్నారు. ధర్నాను మానేయాలని ఆశాలకు విన్నవించారు.
ఢిల్లీ పోలీసుల కస్టడీకి
కల్తీ ఔషధ నిందితుడు
యశవంతపుర: దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన నకిలీ ఔషధాల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ప్రముఖ నిందితుడు ప్రశాంత్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయి బెంగళూరు జైల్లో ఉన్న అతన్ని కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఢిల్లీలో కూడా నకిలీ మందుల వ్యాపారం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఢిల్లీకి చెందిన వ్యక్తి నుంచి ప్రశాంత్ రూ.2 కోట్లు తీసుకొని మోసం చేసినట్లు అక్కడి మోతీలాల్ బాగ్ ఠాణాలో కేసు దాఖలైంది. ఈ వ్యవహారంలో ప్రశాంత్‌ను ఢిల్లీకి తరలించారు.
3 ఎలుగుబంట్లతో
రైతు పోరాటం
● తీవ్రగాయాలతో విషమం
సాక్షి బెంగళూరు: సాధారణంగా ఒక ఎలుగుబంటి కనిపిస్తేనే పరుగులు తీస్తాం.. కానీ ఒక రైతుపై మూడు ఎలుగుబంట్లు దాడికి దిగాయి. ప్రాణాపాయం తప్పదనుకున్న రైతు ధైర్య సాహసాలతో వాటితో పోరాడాడు. ఈ అరుదైన సంఘటన చిత్రదుర్గ జిల్లా హోళల్కెరె తాలూకా హీరే ఎమ్మిగనూరు గ్రామంలో జరిగింది. ప్రకాశ్ అనే రైతు వక్క తోటలో పని చేస్తుండగా మూడు ఎలుగుబంట్లు దూసుకొచ్చి అతనిపై దాడికి దిగాయి. ప్రకాశ్ వాటిని వట్టి చేతులతోనే ఎదుర్కొన్నాడు. చివరకు భల్లూకాలు వెళ్లిపోయాయి. వాటి దాడిలో ప్రకాశ్‌కు తల తీవ్రంగా దెబ్బతింది. పుర్రె భాగం విరిగిపోయింది. రక్తపుమడుగులో పడి ఉన్న ఆయనను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దావణగెరె జిల్లా చిగటేరి ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరం ముష్టూరు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో మిథున్‌రెడ్డి (21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చింతామణి తాలూకాకు చెందిన శ్రీనివాస్, కుసుమ దంపతుల కుమారుడు మిథున్‌రెడ్డి చిక్కబళ్లాపురం ఎస్‌జెసిఐటి కాలేజ్‌లో బీటెక్ థర్డియర్ చదువుతున్నాడు. ముష్టూరు రోడ్డులో అద్దె ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు స్నేహితులు ఫోన్‌చేసినా స్పందన లేకపోవడంతో అక్కడికి వచ్చి చూశారు. అతడు ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులు పరిశీలించగా డెత్‌నోట్ కనిపించింది. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సమస్యలా, కాలేజీలో ఇబ్బందులా అనేది తేలాల్సి ఉంది.
సిటీలో రౌడీల ఇళ్లలో సోదాలు
యశవంతపుర: బెంగళూరు నగరంలో రౌడీల ఆగడాలను అరికట్టడానికి బెంగళూరులో ఆదివారం తెల్లవారుజాము నుంచి యాంటీ రౌడీ స్క్వాడ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సీఎం డీకే శివకుమార్ సూచనల మేరకు, పోలీసు కమిషనర్ ఆర్.హితేంద్ర ఆధ్వర్యంలో సుమారు నూరుమంది రౌడీల ఇళ్లపై దాడులు చేశారు. ఏఆర్‌ఎస్ చీఫ్ హేమంత్ నింబాళ్కర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరవ్యాప్తంగా దాడులు చేసి రౌడీల ఇళ్లలో మారణాయుధాలు, మత్తు పదార్థాల కోసం గాలించారు. అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లలో లేని రౌడీలకు కాల్ చేసి ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రజ్వల్‌కు నో బెయిల్
శివాజీనగర: అశ్లీల వీడియో చిత్రీకరణ కేసులో అవధిలోగా చార్జిషీట్ దాఖలు చేయనందుకు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు తప్పనిసరి బెయిల్ ఇవ్వాలని వేసిన అర్జీని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు గతంలో కొట్టివేసింది. దీనిని హైకోర్టు తిరస్కరించింది. అయితే ఇప్పటికే అత్యాచారం కేసులో జీవితఖైదులో ఉన్నందున ప్రజ్వల్‌కు ఎలాంటి ఉపశమనం లభించదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎం.నాగప్రసన్న ఆదేశాలిచ్చారు. గడువులోగా పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయనందున ప్రజ్వల్ ఈ కేసులో తప్పనిసరి బెయిల్‌ను కోరవచ్చు, అయితే, అతడు మరో కేసులో శిక్ష అనుభవిస్తున్నందున విడుదలకు అర్హుడు కాదు అని జడ్జి పేర్కొన్నారు.


