మైసూరు: నగరంలోని ఇర్విన్ రోడ్డులో ఉన్న పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో తులసి పండుగను భక్తిభావంతో నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు విద్వాన్ కృష్ణమూర్తి నేతృత్వంలో తులసి కోటను అలంకరించి పూజించారు. ఆలయానికి వచ్చిన వేలాది భక్తులకు తులసి మొక్కలను పంపిణీ చేశారు.
స్పాలో కీచకుడు
యశవంతపుర: బ్యూటీ సెలూన్‌లో పనిచేస్తూ, అక్కడకు వచ్చే యువతులు, మహిళలను వేధిస్తున్న ఓ కీచకుని ఉదంతమిది. అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితున్ని అరెస్ట్ చేశారు. బెంగళూరులోని బసవేశ్వర నగరలోని ప్రైవేట్ హెయిర్ స్పాలో ఈ ఘటన జరిగింది. అక్కడ పని చేస్తున్న అర్లసన్ గాజి.. కస్టమర్లకు మసాజ్ చేస్తుంటాడు. తనకు మసాజ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళా కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సెలూన్ ప్రముఖ బాలీవుడ్ నటునికి చెందినదని తెలుస్తోంది.
కేఏఎస్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల
శివాజీనగర: సుమారు 300కు పైగా కేఎఏఎస్ పోస్టుల భర్తీకి కేపీఎస్‌సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను ఆ సంస్థ ఆదివారం విడుదల చేసింది. 5 రోజుల కిందటే పరీక్షలు జరగడం తెలిసిందే. ఇంత తక్కువ సమయంలో ఫలితాలను ప్రకటించడం రికార్డుగా అధికారులు తెలిపారు. సమాధానాలపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి అభ్యర్థులకు 23 వరకు గడువిచ్చారు. ఆ తరువాత, కేఏఎస్ మెయిన్ పరీక్షలకు మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. అభ్యర్థులు కేపీఎస్‌సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
మెట్రో స్టేషన్ వద్ద మంటలు
యశవంతపుర: బెంగళూరు బీటీఎం లేఔట్‌లో రాగిగుడ్డ మెట్రోస్టేషన్ వద్ద శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మెట్రోస్టేషన్‌కు చాలా దగ్గరగా మంటలు వ్యాపించటంతో పాటు దట్టమైన పొగ ఆవరించింది. ప్రయాణికులు, స్థానికులను అందోళన కలిగించింది. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియటంలేదు. కరెంటు వైర్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
రచయిత రవి విచారణ
శివాజీనగర: యోగి బసవేశ్వరున్ని కించపరిచేలా బసవ మంటపం పుస్తకాన్ని రచించారనే కేసులో రచయిత రవి హంజ్‌ను నగర పోలీసులు ప్రశ్నించారు. కేరళలోని కొచ్చిలో అరెస్టు చేసిన ఆయనను బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసులు తీసుకువచ్చి ప్రశ్నించారు. సుమారు గంటసేపు ప్రశ్నించి, సోమవారం మళ్లీ హైగ్రౌండ్స్ ఠాణాకు రావాలని నోటీసు ఇచ్చి పంపారు. రవి హంజ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బసవణ్ణను అవమానించే ఉద్దేశం లేదన్నారు.
ఆటో ఢీ..
గర్భిణి మీద కూలిన గోడ
● ఆమె, కడుపులో శిశువు మృత్యువాత
మండ్య: ఇంటి ముందు కాంపౌండ్‌ను గూడ్స్ ఆటో వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కాంపౌండ్ గోడ కూలి పడడంతో గర్భిణీ, కడుపులోని శిశువు గాయాలతో మరణించారు. ఈ ఘటన జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలూకా బెళగోళ గ్రామం అంబేడ్కర్ కాలనీలో జరిగింది. వివరాలు.. సుశ్మిత (25) 8 నెలల గర్భిణి. నాలుగేళ్ల చిన్నారితో కలిసి ఇంటి ఆవరణలో కూర్చుంది. ఈ సమయంలో రోడ్డు మీద వెళ్తున్న ఆటో ఆదుపుతప్పి ప్రహరీని ఢీకొనగా అది కూలి సుశ్మిత, మరో చిన్నారి మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు హుటాహుటిన సిజేరియన్ చేసి సుస్మిత కడుపులో నుంచి బిడ్డను బయటకు తీశారు. అయితే 2 గంటల తరువాత తల్లీ బిడ్డ పరిస్థితి విషమించి కన్నుమూశారు. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనా స్థలాన్ని కేఆర్‌ఎస్ పోలీసులు పరిశీలించి ఆటో డ్రైవరును అరెస్టు చేశారు. అనుకోని ఘోరంతో కాలనీలో విషాదం తాండవించింది.


