లోకాయుక్త ఆకస్మిక దాడులు | - | Sakshi
Sakshi News home page

లోకాయుక్త ఆకస్మిక దాడులు

Nov 19 2026 3:01 AM | Updated on Nov 19 2026 3:01 AM

బనశంకరి: సర్కారీ కొలువు చాటున ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించారని ఆరోపణలు రావడంతో లోకాయుక్త బుధవారం వివిధ జిల్లాల్లో 7 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల ఇళ్లు, ఆఫీసుల్లో ముమ్మరంగా దాడులు నిర్వహించింది. హాసన్‌, చిత్రదుర్గ, బాగల్‌కోటే, బీదర్‌, హుబ్లీ, మైసూరు తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి సోదాలు ప్రారంభించి భారీమొత్తంలో డబ్బు, బంగారం, భూములు, విలువైన సొత్తు రట్టయింది.

కొడుకు బ్యాగులో డబ్బులు కుక్కి..

● హాసన్‌ జిల్లా సకలేశపుర వలయ అటవీశాఖ అధికారి (ఆర్‌ఎఫ్‌ఓ) హేమంత్‌కుమార్‌కు చెందిన హాసన్‌ సిటీలో చిక్కహొన్ననహళ్లి, కువెంపునగర, దొడ్డమగ్గె, ఆలూరు కాంట్రాక్టర్‌ హరీశ్‌ ఇంటితో పాటు తనిఖీలు సాగించారు. ఈ సమయంలో హేమంత్‌కుమార్‌ భారీగా నగదును కుమారుని స్కూల్‌బ్యాగ్‌, ప్యాంట్‌జేబులో పెట్టి పంపించడానికి యత్నించాడు. అధికారులు అడ్డుకుని రూ.500 నోట్ల కట్టలను సీజ్‌ చేశారు.

డాక్టర్లకు షాక్‌

● చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రి సర్జన్‌ డాక్టర్‌ రవీంద్ర, కొలతలు, తూనికల శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ ఇళ్లు, ఆఫీసులు కలిపి 10 స్థలాల్లో లోకాయుక్త ఎస్పీ ఎంఎస్‌.కౌలాపుర, డీఎస్పీ కళావతి నేతృత్వంలో సోదాలు నిర్వహించారు, చెళ్లకెరె రోడ్డులోని డాక్టర్‌ రవీంద్ర నివాసం, ఆయనకు చెందిన అక్షయ గ్లోబల్‌ ఆస్పత్రిలో రికార్డులను పరిశీలిస్తున్నారు. విద్యానగరలో వెంకటేశ్‌ నివాసంలో భారీమొత్తంలో స్థలాలు, వాణిజ్యకట్టడాలు, వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు, బంగారు నగలు, నగదు లభ్యమైంది.

● బీదర్‌ వైద్య విజ్ఞాన సంస్థ నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రాజకుమార్‌ మాలగె ఇల్లు, ఆఫీసు సహా 5 చోట్ల దాడులు జరిపారు. భారీ మొత్తంలో లెక్కలు లేని డబ్బు, బంగారం, ఆస్తలు వివరాలు బయటపడ్డాయి.

● గతంలో లంచం తీసుకుంటుండగా లోకాయుక్త వలలో పడిన జమఖండి తాలూకా పంచాయతీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ హిప్పరగికి జమఖండిలో ఉన్న ఇల్లు, తండ్రి జీవించే మరో ఇంట్లో సోదాలు చేపట్టారు. ఎస్పీ మహాలింగ నందగావి, డీఎస్పీ సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

వివిధ జిల్లాల్లో 7మంది

అధికారుల ఇళ్లలో సోదాలు

ఓ కండక్టరు నివాసంలో కూడా

పెద్దమొత్తంలో ఆస్తుల గుర్తింపు

కేఎస్‌ ఆర్టీసీ కండక్టర్‌ ఇంట్లో..

అక్రమాస్తులు ఉన్నాయనే సమాచారంతో హుబ్లీలో వాయువ్య ఆర్టీసీ బస్‌డ్రైవర్‌ కమ్‌ కండక్టర్‌ షడక్షరయ్య ఇంట్లో ధార్వాడ లోకాయుక్త ఎస్పీ సిద్దలింగప్ప నేతృత్వంలోని సోదాలు చేపట్టారు. దీంతో చుట్టుపక్కలవారు ఆశ్చర్యపోయారు.

చామరాజనగరలో అటవీశాఖ ఆర్‌ఎఫ్‌ఓ సురేంద్ర ఆఫీసు, ఇంట్లో తనిఖీలు జరిపారు.

లోకాయుక్త దాడులు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగాయి. దొరికిన బంగారం, డబ్బులు, ఆస్తిపత్రాల మదింపు కొనసాగుతోంది. ఇంకా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు, లాకర్లను పరిశీలించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement