శివాజీనగర: రాష్ట్రంలోని పెట్రోల్ పంపుల్లో నిర్దేశిత పరిమితికి మించి ఇథనాల్‌ను కలుపుతున్నారని, తమ పరీక్షల్లో భారీ వ్యత్యాసం వచ్చిందని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ హర్షద్, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. వాహన మైలేజీ, ఇంజన్ మరమ్మత్తులు, తక్కువ ఇంధన సరఫరాపై ప్రజల నుంచి వస్తున్న విస్తృత ఫిర్యాదుల నేపథ్యంలో, సామాన్యుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రిజ్వాన్ డిమాండ్ చేశారు. గత సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని 63 పెట్రోల్ పంపుల నుంచి సేకరించిన ఇంధన నమూనాలలో పరిమితికి మించి ఇథనాల్ ఉన్నట్లు తేలిందని చెప్పారు.
పెట్రోలు భర్తీలోనూ లోపాలు
మరోవైపు రాష్ట్రంలోని 805 పెట్రోల్ పంపులలో నిర్వహించిన తనిఖీలో 768 పెట్రోల్ పంపుల యంత్రాలకు రీకాలిబరేషన్ అవసరమని లీగల్ మెట్రాలజీ అధికారులు కనుగొన్నారు. 3,071 నాజిల్‌లను తనిఖీలు చేయగా, 2,618 నాజిల్‌ల లెక్క సరిగా లేదని గుర్తించారు. దీనివల్ల లీటరు పెట్రోలు పోస్తే అంతే మొత్తం ట్యాంకులోకి రాదు. 101 పెట్రోల్ పంపులపై కేసు నమోదు చేసి, రూ.6.66 లక్షల జరిమానా వసూలు చేశారు. వాహనాల్లోకి పెట్రోలు వేసే యంత్రాలు 9 నుంచి 11 నెలల్లోనే వాటి కచ్చితత్వాన్ని కోల్పోతున్నందున కేంద్ర నిబంధనలను సవరించాలని మంత్రి హర్షద్ సూచించారు. ప్రతి పెట్రోల్ బంక్‌లో ఆయా గ్రేడ్ పెట్రోల్‌లో ఉండే ఇథనాల్ పరిమాణాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని, బిల్లులోనూ తెలపాలని చెప్పారు.
పెట్రోల్‌లో ఇథనాల్
శాతంపై రేగిన రగడ
కేంద్ర పెట్రోలియం మంత్రికి
రాష్ట్ర మంత్రి రిజ్వాన్ లేఖ


