శివాజీనగర: రాష్ట్ర మంత్రిమండలిలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, వాటిని భర్తీ చేయాలని సీఎం డీ.కే.శివకుమార్, హైకమాండ్ కసరత్తు చేస్తున్నారు. డీకే సీఎంగా 3 నెలలు పూర్తి చేసుకున్నారు. సోమవారం సీఎం సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లారు. హైకమాండ్ ఆమోదం తీసుకుని ఈ నెలాఖరులోగా ఆ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణలో సీఎం డీకే, మాజీ సీఎం సిద్దరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆపై రాహుల్‌గాంఽధీని కలిసి ఎవరెవరికి పదువులు అనేది చర్చించే అవకాశముంది.
మహిళా మంత్రి లేరు
కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో ఆ 2 పోస్టులను మహిళలకే కేటాయిస్తారా, కనీసం ఒక్కటైనా ఇవ్వవచ్చనే ప్రచారం సాగుతోంది. ఇటీవల కాలంగా కర్ణాటకను కుదిపేస్తున్న సిద్దరామయ్యపై స్టింగ్ ఆపరేషన్ వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. ఖాళీగా ఉన్న రెండు సీట్లలో ఒకదానిని మహిళా ఎమ్మెల్యేకు కచ్చితమనే ప్రచారం ఉంది.
పురుషుల కోటాలో తీవ్ర పోటీ
మరొక పోస్టు ఎవరికి అనేది ఉత్కంఠగా మారింది. ఎంతోమంది మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. మహిళల విభాగంలో బెళగావి సీనియర్ లక్ష్మీ హెబ్బాళ్కర్‌తో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కల్బుర్గి ఎమ్మెల్యే ఫాతిమా పేరు కూడా ఉంది. లక్ష్మికి పోస్టు ఇవ్వాలని సీఎం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హైకమాండ్ కరుణ ఎవరికి దక్కుతుందోననేది తేలాల్సి ఉంది.
మాజీ సీఎం సిద్దరామయ్య ఓ మంత్రి పదవిని తాను సూచించిన, తమ కులానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అందులో బసవరాజ నీలన్న శివన్న పేరు ప్రచారంలోకి వచ్చింది. బెంగళూరులో కొందరు బడా ఎమ్మెల్యేలు కూడా రేసులోకి వచ్చారు. దీంతో రాహుల్‌గాంధీ తీసుకునే నిర్ణయం అంతిమం కానుంది. అంతా హైకమాండ్ నిర్ణయం ప్రకారమే జరుగుతుందని సీఎం డీకే ఆదివారం అన్నారు. అయినప్పటికీ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.
త్వరలో ప్రమాణ స్వీకారోత్సవం ఉండేనా!
ఢిల్లీలో తీర్మానం చేసేరా?
ఒక పోస్టు మహిళలకు కచ్చితం
హస్తిన యాత్రలో సీఎం డీకే, సిద్దు


