● నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య
● మృతదేహాన్ని వెలికితీయబోయి మరొకరు
బొమ్మనహళ్లి: ఓ మహిళ దక్షిణ పినాకిని నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోగా, ఆమె మృతదేహాన్ని వెలికితీయడానికి వచ్చిన వ్యక్తి కూడా నీటిలో మునిగి చనిపోయాడు. ఈ విషాద సంఘటన బెంగళూరు నగర శివార్లలోని ఆనేకల్ తాలూకాలోని ముగలూరులో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. కవిత (35)కు భర్త శ్రీనివాస్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్తతో గొడవపడి వచ్చి నదిలోకి దూకింది. సర్జాపుర పోలీసులు ఆమె మృతదేహాన్ని వెలికితీయాలని మాలూర్ మంజునాథ్‌ను పిలిచారు. నదిలోకి దూకిన అతడు నీటిలో మునిగి మరణించాడు. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఒత్తిడే కారణమని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కవిత సోదరి మునిరత్న మాట్లాడుతూ, కవితకు పైళ్లె 15 ఏళ్లు అయిందని, మొదటిరోజు నుంచీ భర్త వేధిస్తున్నాడని తెలిపింది. ఆదివారం కూడా భార్యాభర్తల మధ్య కొట్లాట జరిగింది. మొదట్లో బిడ్డతో కలిసి చనిపోతానని విలపించింది. తరువాత కవిత ఒక్కరే నదిలోకి దూకింది, భర్త వేధింపులే అంతటికీ కారణమని ఆరోపించారు.
పౌరసత్వ కేసులో
అర్జీదారులకు ఊరట
బొమ్మనహళ్లి: దేశంలో నివసిస్తున్న ఒక వ్యక్తి పత్రాలను చూసి అతను విదేశీయుడని నిరూపించే అధికారం ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి పౌరసత్వంపై చట్టపరమైన విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకునే వరకు దేశ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయలేమని కూడా కోర్టు పేర్కొంది. అక్రమ బంగ్లాదేశీ వలసదారుడనే అనుమానంతో నిర్బంధించి, బెంగళూరులోని కొత్తూరులో ఉన్న పునరావాస కేంద్రంలో ఉంచిన అబ్దుల్ రహీం, అతని బంధువు జహిదుల్ ఇస్లాం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు జడ్జి జస్టిస్ సి.ఎం.పూణచ్చ ధర్మాసనం విచారించి ఈ ఉత్తర్వులను జారీ చేసింది. బెంగళూరులోని కుడ్లులో భిక్షాటన చేసే పిటిషనర్లు అక్రమ వలసదారుల గాలింపులో ఈ మార్చిలో పట్టుబడ్డారు. తాము భారత పౌరులమే అని వారు వాదించారు.
హిరియూరు బీజేపీకి లేనట్టే!
● కుమారస్వామి వ్యాఖ్యలు
యశవంతపుర: హిరియూరు అసెంబ్లీ క్షేత్రం ఉప ఎన్నికలలో పోటీ గురించి బీజేపీ– జేడీఎస్ మధ్య ఎలాంటి గందరగోళం లేదని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. దక్షిణకన్నడ జిల్లా కొల్లూరులో విలేకరులతో మాట్లాడారు. మా పార్టీల మధ్య వివాదంలేదు, బీజేపీ పోటీ చేయాలనుంది, మేము కూడా బరిలో ఉంటామని జేడీఎస్ నాయకులు చెబుతున్నారు అని చెప్పారు. హిరియూరులో స్వాతంత్య్రం వచ్చిన్నప్పటి నుంచి కాంగ్రెస్– జేడీఎస్ మధ్యే పోటీ ఉందన్నారు. 2013కు ముందు అక్కడ బీజేపీ లేదన్నారు. స్థానిక ప్రజలు జేడీఎస్ పోటీలో ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని కుమారస్వామి చెప్పడం గమనార్హం. బీజేపీ నాయకులతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని అన్నారు.
కేపీఎస్‌సీ స్కాంలో
నలుగురికి రూ.8.69 కోట్లు
శివాజీనగర: కేపీఎస్‌సీ ఉద్యోగాల భర్తీ కుంభకోణంలో ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్‌తో సహా నలుగురిపై ఈడీ ప్రత్యేక కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం రూ.8.69 కోట్ల డబ్బు లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు తెలిపారు. శివశంకరప్ప సాహుకార్, మాజీ సభ్యురాలు బీవీ గీతా శివమూర్తి, అప్పటి ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్, బ్రోకరు బసవరాజ్ కన్నాలేపై మనీలాండరింగ్ కేసు కింద దర్యాప్తు సాగించారు. సాహుకార్‌కు రూ.4.17 కోట్లు, బీ.వీ.గీతకు రూ.1.48 కోట్లు, జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్‌కు రూ.1.52 కోట్లు, బసవరాజ్ కన్నాలేకు రూ.1.52 కోట్లు చేరినట్లు ఈడీ ప్రకటించింది.


