బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని శ్రావణ బెళగొళ హోబ్లిలోని దాడిఘట్ట గ్రామంలో సోమవారం నాడు లక్ష్మీదేవి (దాడి ఘట్టదమ్మ) శిలా ఉత్సవం జాతర వేడుకలు ఆనందోత్సాహాలతో ఆచరించారు. అమ్మవారికి విశేష పూజలు, ఉత్సవమూర్తి ఊరేగింపు, టపాసుల పేలుళ్లతో సందోహం ఏర్పడింది. లక్ష్మీదేవి పల్లకిని యువకులు భుజాలపై మోస్తూ చల్యా, కుంబెనహళ్లి, దాడిఘట్ట గ్రామాల గుండా ఊరేగించారు. దాడిఘట్టలోని సిదిలుకల్లు కొండ చరిత్రాత్మకమైనది. పాండవులు వనవాసంలో ఇక్కడి పెద్ద రాళ్లపై ఆడుకునేవారని నమ్ముతారు. భక్తులు ఆ రాళ్లపై కూర్చుని ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఊయల ఉత్సవంలో భాగంగా మహిళలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయాకారంలో కూర్చుని ఊగారు.
అత్తారింటికి వెళ్తే.. ఇల్లు లూటీ
మైసూరు: దొంగల ముఠా ఇంటి తాళం పగలగొట్టి అల్మరాలోని రూ. 21.17 లక్షల విలువైన బంగారు నగలు, రూ. 4.20 లక్షల నగదును దొంగిలించింది. ఈ ఘటన మైసూరు తాలూకాలోని యాచెగౌడ గ్రామంలో లోకేష్ ఇంట్లో జరిగింది. అతను దీపావళి పండుగ కోసం నవంబర్ 10న తన కుటుంబంతో కలిసి బిలికెరె దగ్గర ధర్మపురలో ఉన్న తన అత్తగారింటికి వెళ్లాడు. ఈ సమయంలో దొంగలు దోచుకెళ్లారు. ఇంట్లోనే అల్మరా తాళం చెవి ఉండడంతో దొంగల పని సులభమైంది. తలుపులు తెరిచి ఉండడం చూసి ఇరుగుపొరుగు లోకేష్‌కు కాల్ చేసి చెప్పారు. దీంతో గాభరాపడుతూ వచ్చిన బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గజ దాడిలో కూలీ బలి
దొడ్డబళ్లాపురం: హాసన్ జిల్లా బేలూరు తాలూకా నాగేనహళ్లిలో అడవి ఏనుగు ఓ వ్యక్తిని బలితీసుకుంది. మూడు రోజుల క్రితం చౌడనహళ్లి గ్రామంలో జయమ్మ అనే మహిళను ఏనుగు బలిగొంది. తాజాగా నాగేనహళ్లిలో హఫీజుర్ రెహమాన్ (57) అనే కూలీ కాఫీ తోటలో పని చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఏనుగు దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు అక్కడే మరణించాడు. మృతుడు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వలస కూలీ అని తెలిసింది. స్థానికులు, కూలీలు ఆగ్రహంతో బేలూరులో రోడ్డుమీద ధర్నా చేశారు. అరెహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తీవ్రమైన వీలింగ్ రభస
యశవంతపుర: బెంగళూరు నగరంలో ఆకతాయిల వీలింగ్ బెడద మళ్లీ మొదటికొచ్చింది. చిక్కబిదరకల్లు వంతెనపై నంబర్‌ప్లేట్‌లేని బైకులతో ప్రమాదకరంగా వీలింగ్ చేశారు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు చాలా భయపడ్డారు. బెంగళూరులో తుమకూరు జాతీయ రహదారిలో బైకు వీలింగ్ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నా పోలీసులు అడ్డుకోవడం లేదనే విమర్శలున్నాయి. చీకటి పడగానే పోకిరీలు బైకులపై గందరగోళం చేస్తున్నారు. హైవేపై 20 వరకూ బైకులు, స్కూటర్లతో గుంపులుగా వచ్చి రభసకు పాల్పడుతున్నారు. పైగా సైలెన్సర్ తీసేసి కఠోరమైన శబ్ధాలతో వీలింగ్ చేస్తారు. ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యూటర్న్‌లో మృత్యుఘోష
● బస్సు ఢీకొని ఇద్దరు మృతి
తుమకూరు: జిల్లాలో తిపటూరు– అరసికెరె రహదారిపై మదిహళ్లి దగ్గర బాలాజీ చౌల్ట్రీ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. గెద్దెలెహళ్లివాసి సంజు (23), బైరనాయకనహళ్లివాసి హర్ష (23) మృతులు. హర్ష ఎంబీఏ పూర్తి చేసి ఓ కంపెనీ అకౌంట్స్‌లో పనిచేస్తున్నాడు. సంజు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. సోమవారం బంధువుల పెళ్లికి వెళ్లి బైక్‌లో తిరిగి వస్తున్నారు. చౌల్ట్రీ ముందు యూ–టర్న్ తీసుకుంటుండగా అరసికెరె నుంచి వస్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడే చనిపోయారు. ఉన్నత విద్యలు చదివి భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న యువకుల మరణం వారి కుటుంబాల్లో తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడమే కారణమని ఆరోపణలున్నాయి. ఆయా గ్రామాల్లో శోకం ఆవహించింది.


