హొసపేటె: విజయనగర జిల్లా హువినహడగలి తాలూకా ఉత్తంగి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఇద్దరు రైతులకు చెందిన నాలుగు గడ్డివాములను పూర్తిగా దగ్ధం చేశాయి. మంగళవారం రాత్రి సుమారు 1 గంట సమయంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే వాములకు వ్యాపించడంతో గడ్డివాములు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న హూవినహడగలి, హగరిబొమ్మనహళ్లి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదంలో ఇద్దరు రైతులకు చెందిన పశుగ్రాసం పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.10 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు. అయితే వాముల సమీపంలో ఉన్న ఎద్దులు, ఆవులు, గేదెలు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయట పడటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించాలని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని కర్ణాటక రాష్ట్ర ఉల్లి సాగుదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ఎం.సిద్దేష్ డిమాండ్ చేశారు. కష్టపడి పండించిన, రైతుల నుంచి సేకరించి, పశువుల కోసం నిల్వ చేసుకున్న పశుగ్రాసం కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు.
మంటల్లో నాలుగు గడ్డి వాములు ఆహుతి
ఇద్దరు రైతులకు రూ.10 లక్షలకు పైగా నష్టం


