హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె పట్టణంలో దారుణ హత్య కలకలం రేపింది. చేబదులుగా ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగినందుకు ఓ యువకుడిని రుబ్బురాయితో తలపై బలంగా బాది అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి ఎస్ఎల్.చౌకి 4వ క్రాస్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో హత్యకు గురైన యువకుడిని హొసపేటెకు చెందిన ఆటో డ్రైవర్ కిరణ్ అలియాస్ చుమ్మి (25)గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కిరణ్ ఒక వ్యక్తికి చేబదులుగా డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులను తిరిగి తీసుకునేందుకు మంగళవారం అర్ధరాత్రి 1 గంట నుంచి 1.30 గంటల మధ్య ఎస్ఎల్.చౌకి 4వ క్రాస్‌కు వెళ్లాడు.
డబ్బు విషయమై వాగ్వాదం
ఈ క్రమంలో డబ్బు విషయమై కిరణ్‌కు, నిందితుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నిందితుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి కిరణ్‌పై దాడికి దిగాడు. రుబ్బురాయితో తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హొసపేటె పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో కరియప్ప అలియాస్ కరియా, రాజశేఖర్, వెంకటేష్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చేబదులుగా ఇచ్చిన డబ్బులే యువకుడి ప్రాణాలను బలిగొన్నాయా? అనే కోణంలో ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చేబదులు సొమ్ము తిరిగిమ్మన్నందుకు రుబ్బురాయితో దాడి
ముగ్గురు నిందితులను అదుపులోకి
తీసుకున్న పోలీసులు


