బళ్లారిఅర్బన్: నగర ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా మంగళవారం తెల్లవారు జాము నుంచే భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్తీకమాసం మొదటి మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అమ్మవారికి మొక్కుబడి కుంభాలు, బాణాల కార్యక్రమాలు నెరవేర్చారు. ఆలయం చుట్టు మూడు ప్రదక్షిణలు చేసి మహిళలు ఆలయ ప్రాంగణంలో కుంభాలను ఏర్పాటు చేసిన గజస్తంభం వద్ద దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని వెండి ఆభరణాలు, పూలతో, గర్భగుడి ద్వారాన్ని గుమ్మడికాయలతో ప్రత్యేకంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.


