బళ్లారి రూరల్: ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే చర్యల్లో భాగంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) విధించిన షరతులకు ప్రభుత్వం అంగీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం బళ్లారిలోని ఓపీడీ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర కోశాధికారి సుభాష్ బెట్టదకొప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసేలా ఏడీబీ షరతులపై సంతకాలు చేసిందని ఆరోపించారు. 2030 నాటికి క్లస్టర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఒకే చోట విలీనం చేయాలనే ఆలోచన వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ విధానంతో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు విద్యార్థులు, ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కంబళి మంజునాథ్, సభ్యులు కాంతేశ్, తిప్పేస్వామి పాల్గొన్నారు.


