హొసపేటె: విజయనగర జిల్లాలో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచాలి. కొత్తగా నిర్మించిన 250 పడకల జిల్లా ఆస్పత్రిని 400 పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించాలి. వైద్య కళాశాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. కర్ణాటక రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో నగర శివారులోని నూతన జిల్లా ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కొత్త జిల్లా ఆస్పత్రిని అన్ని ఆధునిక వైద్య సదుపాయాలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందు కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే ఆస్పత్రిలో కాంట్రాక్టు సిబ్బంది నియామకాల సమయంలో కోవిడ్ సమయంలో 100 పడకల ఆస్పత్రిలో సేవలందించిన కార్మికులు, స్థానిక విద్యావంతులైన నిరుద్యోగ పేద యువతకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిలా ఆస్పత్రి సర్జన్ డాక్టర్.ఎల్‌ఆర్.శంకర్ నాయక్‌కు అందజేశారు.


