● ప్రస్త్తుత పాలికె కాల వ్యవధిలో
మిగిలింది నాలుగు నెలలే
● 13వ తేదీన ఎన్నికలు
● సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, బళ్లారి: బళ్లారి మహానగర పాలికె మేయర్ పీఠంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పని చేస్తున్న మేయర్ గాదెప్ప పదవీ కాలం ఈనెలలో ముగియనుంది. నగర మేయర్, ఉప మేయర్ పదవుల కోసం ఆశావహులు రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కర్ణాటక మున్సిపల్ కార్పొరేషన్ల నిబంధనల ప్రకారం మేయర్, డిప్యూటీ మేయర్ల పదవీ కాలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఏడాదికి ఒకసారి మేయర్, ఉప మేయర్లను మార్చడం అటుంచితే బళ్లారిలో అధికార కార్పొరేటర్ల పదవులు పంపకాల్లో భాగంగా నాలుగు సంవత్సరాల్లో ఐదుగురు మేయర్లు పని చేయడం గమనార్హం. నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే మేయర్, ఉప మేయర్లు నిత్యం మారుతుండటంతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఇక కనీస సౌకర్యాలు అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బళ్లారి మహానగర పాలికె ప్రస్తుత పాలకవర్గం అధికారిక కాల వ్యవధి మరో నాలుగు నెలలు మాత్రమే ఉంది. ఐదో అవధి కింద మేయర్, ఉప మేయర్ మార్పు కూడా అనివార్యమే. ఈ నేపథ్యంలో ఐదో అవధి కింద నగర మేయర్, ఉప మేయర్ ఎంపిక చేయడానికి తేదీ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన కలబుర్గి ప్రాంతీయ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13వ తేదీన నగర మేయర్, ఉప మేయర్ ఎన్నికలు జరిపేందుకు తేదీ ఖరారు చేశారు.
పెరిగిన కాంగ్రెస్ బలం
కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి 21 మంది, బీజేపీ నుంచి 13 మంది, స్వతంత్రులు ఐదుగురు కార్పొరేటర్లు గెలిచారు. ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలం 26కి చేరింది. ప్రస్తుతం నాలుగు నెలలు కాల వ్యవధి ఉన్నప్పటికీ మేయర్, ఉప మేయర్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. అందరి దృష్టి పాలికె మేయర్ ఎంపికపై పడింది. గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఐదుగురు మేయర్లు బాధ్యతలు చేపట్టారు. వీరిలో మహిళలే ఎక్కువగా మేయర్ పీఠాన్ని అదిష్టించడం విశేషం. ఈ ఐదు సంవత్సరాల అధికార అవధిలో మొదటిసారి మేయర్‌గా రాజేశ్వరి, రెండవసారి అతిపిన్న వయస్కురాలైన త్రివేణి ఏడు నెలలు మాత్రమే మేయర్‌గా కొనసాగారు. ఆ తర్వాత శ్వేత, నందీష్, ప్రస్తుతం గాదెప్ప మేయర్‌గా కొనసాగుతున్నారు.
జనరల్ మహిళకు రిజర్వ్..
ప్రస్తుతం నగర మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. ఈ మేయర్ పదవీ కాలం కూడా కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పాలికె ఎన్నికలు వస్తాయి. నాలుగు నెలలు పాటు మేయర్‌గా కొనసాగేందుకు పలువురు మహిళ కార్పొరేటర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వీరిలో కార్పొరేటర్లు శశికళ జగన్నాథ్, బి.రత్నమ్మ తమదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికార కార్పొరేటర్లలో అధిపత్య పోరు ప్రతిసారి కొనసాగుతోంది. మేయర్, ఉప మేయర్ ఎన్నికలప్పుడు అధికార కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఉప మేయర్ జనరల్‌కు కేటాయించారు. ఉప మేయర్ పదవికి కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్ పదవి దక్కించుకునేందుకు కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర మద్దతు అవసరం కానుంది. వీరిద్దరూ ఎవరి పేరు సూచిస్తే వారే మేయర్‌గా ఎంపిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


