ప్రియాంక్‌ ఖర్గే క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

ప్రియాంక్‌ ఖర్గే క్షమాపణ చెప్పాలి

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన హోంశాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే క్షమాపణలు చెప్పాలని జేడీఎస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచాలకుడు శివశంకర్‌ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కుమారస్వామిని విలేజ్‌ ఇడియట్‌ అంటూ చేసిన వ్యాఖ్యల ద్వారా గ్రామీణ ప్రజలను కూడా అవమానించారని ఆరోపించారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రాష్ట్రంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో పాల ధరలు, ఆర్టీసీ చార్జీలు పెంచడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇళకల్‌లోని కంఠి సర్కిల్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే దొడ్డనగౌడ పాటిల్‌ ఆధ్వర్యంలో కూడా నిరసన చేపట్టారు. కార్యక్రమంలో రామకృష్ణ, నరసింహ నాయక్‌, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

హుబ్లీ: స్థానికు గోకుల్‌ రోడ్డు రామలింగేశ్వర నగరంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 21 మందిని గోకుల్‌ రోడ్డు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.43,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గోకుల్‌రోడ్డు పోలీసులు తెలిపారు.

గంజాయి విక్రేతల అరెస్ట్‌

హుబ్లీ: ఎంటీ మిల్‌ క్రాస్‌ వద్ద గిరిణిచాళ మైదానంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.13.50 లక్షలు విలువ చేసే 13.450 కేజీల గంజాయి, మొబైల్‌, నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక గణేష్‌ పేట పాండు, పాత హుబ్లీ సయ్యద్‌ నవాజ్‌పై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

వాహనదారులకు జరిమానా

హుబ్లీ: హుబ్లీ–ధార్వాడ బీఆర్‌టీఎస్‌ నగర రవాణా కారిడార్‌లో ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘిస్తు అక్రమంగా సంచరిస్తున్న ప్రైవేట్‌ వాహనాలపై ట్రాఫిక్‌ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. మొత్తం 53 కేసులు పెట్టి బాధ్యుల నుంచి రూ.26,500 జరిమానా వసూలు చేశారు. సదరు కారిడార్‌లో శిగరి బస్సులు, అంబులెన్సులు, అనుమతి కలిగిన ప్రభుత్వ వాహనాల సంచరానికి మాత్రమే అవకాశం ఉంది. నియమాలను ఉల్లంఘిస్తూ కొందరు కారిడార్‌లో రయ్‌.. రయ్‌ అంటూ దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పోలీస్‌ కమిషనర్‌ భూషన్‌ బుర్సే ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ ఏసీపీ వీరేష్‌ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు.

29న రాష్ట్ర స్థాయి

కరాటే పోటీలు

బళ్లారి టౌన్‌: రాష్ట్ర కరాటే శిక్షకుల సంఘం, బళ్లారి జిల్లా కరాటే శిక్షకుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 29న నగరంలోని అల్లీపురం రోడ్డులో ఉన్న బెస్ట్‌ స్కూల్‌, కళాశాలలో రాష్ట్ర స్థాయి బాలికల కరాటే పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ నదీమ్‌, ప్రధాన కార్యదర్శి కట్టెస్వామి పేర్కొన్నారు. బాలికల్లో ప్రతిభ వెలికితీసేందుకు, ఆత్మస్థైర్యం నింపేందుకు తమ సంఘం కరాటేలో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. సుమారు 27 జిల్లాల నుంచి 800 మంది దాక బాలికలు కరాటే పోటీల్లో పాల్గొంటారన్నారు. వయస్సు, బరువు ఆధారంగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సంఘం జిల్లాధ్యక్షుడు సురేష్‌ పదాధికారులు, మౌనేష్‌, శివకుమార్‌ ప్రకాష్‌ రవి, జడేషలు పాల్గొన్నారు.

రోబోటిక్‌ సర్జరీ పరికరాల కొనుగోలుకు గ్రీన్‌ సిగ్నల్‌

హుబ్లీ: క్యాన్సర్‌ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం బెంగళూరు కిద్వాయి క్యాన్సర్‌ ఆస్పత్రి, హుబ్లీ కేఎంసీ ఆస్పత్రికి మొత్తం రూ.40 కోట్ల వ్యయంతో ఒక్కో రోబోటిక్‌ సర్జరీ యంత్రం కోనుగోలుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సంస్థకు రూ.20 కోట్ల వ్యయంతో రోబోటిక్‌ యంత్రాన్ని కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే మొత్తం వ్యయంలో సంబంధిత సంస్థ రూ.5 కోట్లు భరించాల్సి ఉంటుందని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. ఈ యంత్రాలు అందుబాటులోకి వస్తే క్యాన్సర్‌ రోగులకు మరింత మెరుగైన చికిత్స చేసే అవకాశం లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement