విజయనగర జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విజయనగర జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

హొసపేటె: జిల్లాలో మహిళల సమస్యలపై తక్షణమే స్పందించాలి. వివిధ శాఖల్లోని లోపాలను సరిదిద్ది, ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగలక్ష్మి చౌదరి సూచించారు. శుక్రవారం నగరంలోని జిల్లా ఇండోర్‌ స్టేడియంలో మహిళా స్పందన, ప్రగతి పరిశీలన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. విజయనగర జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అందరూ పని చేయలన్నారు. ఏ శాఖలోనైనా లేదా ప్రైవేట్‌ సంస్థలోనైనా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని.. కేసులు నమోదు కాకపోయినా క్రమం తప్పకుండా పురోగతి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మకాలు నిరాటంకంగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ దురాచారాన్ని అరికట్టడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మద్యం అమ్మకాలపై కేవలం అవగాహన కల్పిస్తే సరిపోదని.. అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రసవాలు జరిగే ఆస్పత్రుల్లో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమన్నారు. ఆస్పత్రుల్లో పని చేస్తున్న అవుట్‌సోర్స్‌ ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు.

భ్రూణహత్యల నిర్మూలనకు చర్యలు

జిల్లాలో భ్రూణహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కాలువలో నాలుగు నుంచి ఐదు పిండాలు లభ్యమైనట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధిత శాఖకు కమిషన్‌ తరఫున లేఖ రాయనున్నట్లు తెలిపారు. భ్రూణహత్యలను పూర్తిగా నిర్మూలించేందుకు ఆరోగ్య శాఖతో పాటు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర శివారులోని శ్మశానవాటిలో నివసిస్తున్న కుటుంబానికి జీవనోపాధి కల్పించేందుకు తోటమాలి ఉద్యోగం కల్పించడంతో పాటు, పిల్లలకు పాఠశాల విద్య అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కుష్టురోగుల కాలనీలో గృహవసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జీవనోపాధి కోసం రూ.25 వేల పరిహారం ప్రకటించినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement