రాయచూరు రూరల్: పెళ్లి పేరుతో యువతిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోసగించాడు. రెండేళ్లపాటు ప్రేమాయణం సాగించి.. చివరికి మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. కర్ణాటకలోని కొప్పళ్ జిల్లాలో ఈ ఉదంతం వెలుగుచూసింది. బాధితురాలు దళిత సంఘాల నాయకులతో కలసి ప్రియుడి బంధువుల నివాసం ఎదుట ఆందోళనకు దిగింది. వివరాలు ఇలా.. బీదర్ జిల్లాకు చెందిన ఓ యువతి గంగావతి పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీరేష్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ బెంగళూరులో దాదాపు ఏడాది పాటు లివింగ్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు. ఇటీవల ఇరు కుటుంబాల సభ్యులతో కలిసి అండమాన్ నికోబార్ దీవుల పర్యటనకు కూడా వెళ్లారు. అయితే ఆ పర్యటన ముగిసినప్పటి నుంచి వీరేష్ తన మొబైల్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. ప్రియురాలని దూరం పెట్టాడు. ప్రేమకు గుడ్‌బై చెప్పి, ఇంట్లో పెద్దలు కుదిర్చిన మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు గురువారం గంగావతి పట్టణంలోని వీరేష్ బావ ప్రకాష్ నాయక్ నివాసానికి చేరుకుంది. తనకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాల నాయకులతో కలిసి ఇంటి ముందే ధర్నా చేపట్టింది. 10 నెలల క్రితమే ఈ వ్యవహారంపై బెంగళూరులోని కె.ఆర్.పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పేర్కొంది. అప్పట్లో వీరేష్ అక్క, బావలు పోలీసుల సమక్షంలో చర్చలు జరిపి, కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపింది. ఇప్పుడు మాట తప్పి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని యువతి స్పష్టం చేసింది.
ప్రియుడి కుటుంబ సభ్యుల
ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా


