రాయచూరు రూరల్: యువత పోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని జిల్లా అధికారి పూవిత సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా యంత్రాంగం, జెడ్పీ, నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీ పరీక్షల శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించి గ్రామస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వివిధ రంగాల్లో రాణించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యూపీఎస్సీ, కేపీఎస్సీ, బ్యాంకింగ్, నాబార్డ్ తదితర పోటీ పరీక్షల ద్వారా లభించే ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే నేటి యువత పోటీ పరీక్షలపై సరైన దృష్టి సారించకుండా మొబైల్ ఫోన్లలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్ట్రా వంటి సామాజిక మాధ్యమాల మోజులో పడి ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు. యువత సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తగ్గించి, పోటీ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీ హంపణ్ణ, నగరసభ కమిషనర్ జుబీన్ మెహపాత్రో, తహసీల్దార్ సురేష్ వర్మ, అధికారులు సిద్ధార్థ, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.


