సాక్షి,బళ్లారి: కట్టుకున్న భర్తను కాదని చివరకు విడాకులు కూడా ఇచ్చి, ప్రియుడి కోసం అన్నీ వదులుకుని నమ్మి వచ్చిన వివాహిత మహిళ ఓ కసాయి ప్రేమికుడి చేతిలో మోసపోయిన వైనం బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... బీదర్ జిల్లా భాల్కి తాలూకా నెలవాడ గ్రామంలో సంగీత అనే వివాహిత మహిళ పొరుగింట్లో ఉండే దత్తు అనే యువకుడితో నాలుగేళ్లుగా స్నేహం చేస్తోంది. అది కాస్తా ప్రేమగా మారడంతో భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకునేందుకు దత్తు వెనుకంజ వేశాడు. దీంతో తన ఇంటి ముందు బైఠాయించి ఆమె నిరసన తెలుపుతుండటంతో దత్తు ఇంటి నుంచి పలాయనం చిత్తగించాడు. బాధిత మహిళ తనకు అన్యాయం జరిగిందంటూ ఆ ప్రేమికుడి ఇంటి ముందే గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతోంది. ఇటు కట్టుకున్న భర్త ఆసరా కరువై, అటు నమ్మి వస్తే ప్రియుడు నిట్టనిలువునా మోసం చేయడంతో ఆ వివాహిత బతుకు వీధిన పడింది.
దారుణంగా మోసపోయిన మహిళ


