బళ్లారిఅర్బన్: ప్రజల ఓటే ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటర్ల హక్కులకు భంగం కలిగితే ప్రజల తరపున ఉద్యమిస్తామని కేపీసీసీ సాంఘిక న్యాయ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.శివకుమార్ పేర్కొన్నారు. గురువారం బళ్లారి నగరంలోని గడిగి చెన్నప్ప(రాయల్) సర్కిల్ వద్ద ఇండియా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటును కాపాడండి.. దేశాన్ని రక్షించండి అనే నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు వేసే అవకాశం కల్పించాలని అన్నారు. సర్ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల జాబితా సవరణ పూర్తి పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్లను తొలగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఓటు హక్కు పరిరక్షణ రాజకీయ పోరాటం మాత్రమే కాదన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యత అని అన్నారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
సీఈసీ రాజీనామా చేయాలి
హొసపేటె: ఓటరు జాబితా నుంచి ఓట్లను తొలగిస్తున్నారు, ఓటును కాపాడండి– దేశాన్ని రక్షించండి అనే నినాదంతో గురువారం విజయనగర జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హొసపేటెలో భారీ నిరసన చేపట్టారు. నగరంలోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును కాపాడుకునే అవకాశం కల్పించాలని వారు ఒత్తిడి చేశారు.
సీఈసీని డిిస్మిస్ చేయాలి
రాయచూరు రూరల్: దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడు శాంతప్ప మాట్లాడారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను డిిస్మిస్ చేయాలని, సర్‌ను పూర్తిగా నిషేధించాలన్నారు. ఆందోళనలో విధాన పరిషత్ సభ్యుడు బోసురాజు, అమరేగౌడ, రుద్రప్ప, శివమూర్తి, రజాక్, నరసింహనాయక్, మరిస్వామి, అరుణ్, అంజనేయ, నిర్మల, వందనలున్నారు.
బళ్లారిలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
హొసపేటెలోని ప్రధాన సర్కిల్‌లో ధర్నా చేస్తున్న కార్యకర్తలు
ఓటు హక్కును హరించే ప్రయత్నాలను సహించబోం
వాడవాడలా సర్‌పై కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు


