సాంకేతిక పరిజ్ఞాన లబ్ధి పొందండి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞాన లబ్ధి పొందండి

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక సమాజంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగపరచుకోవాలని ఎస్పీ అరుణాంగ్శు గిరి పిలుపునిచ్చారు. ఆయన బుధవారం రాయచూరు తాలూకా ఆత్కూరులో జిల్లా యంత్రాంగం, జడ్పీ, సాంఘీక సంక్షేమ శాఖ, గ్రామ పంచాయతీ, పోలీస్‌ శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి తోడు దౌర్జన్యాల నియంత్రణకు అధికారులు బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. ఏఎస్పీ హరీష్‌, తహసీల్దార్‌ సురేష్‌, టీపీ ఈఓ చంద్రశేఖర్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, రాజశేఖర్‌లున్నారు.

ఘర్షణ వద్దన్నందుకు వ్యక్తిపై దాడి

హుబ్లీ: వ్యక్తిగత విషయమై ఓ ప్రార్థన మందిరంలో ఘర్షణ పడకూడదని చెప్పినందుకు కోపగించుకొని ఓ వ్యక్తిపై దాడి చేయడమే కాకుండా ప్రాణాలు తీస్తామని బెదిరించిన ఘటన పాత హుబ్లీ నురాణి ఫ్లాట్‌ మసీదు వద్ద చోటు చేసుకుంది. ఆ ఫ్లాట్‌కు చెందిన మహమ్మద్‌ అజీంపై నాసీర్‌, అయాన, అమీర్‌ తదితరులు దాడి చేసినట్లు పాత హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

బంగారు ఆభరణాల చోరీ

మరో ఘటనలో రూ.లక్షలాది విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంటికి వేసిన తాళాన్ని విరిచి లోనికి వెళ్లిన దొంగలు ఆ ఇంట్లోని రూ.2.48 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఘటన విద్యానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హనుమంత నగర్‌లో జరిగింది. మల్లికార్జునకు చెందిన ఇంట్లోని రూ.1.60 లక్షల విలువ చేసే 20 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.88,500 విలువ చేసే 590 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మా ఇంట్లో

నల్లుల బెడద తీర్చమ్మా..

● హుండీలో యల్లమ్మ దేవికి భక్తుడి మొర

హుబ్లీ: ఉత్తర కర్ణాటక ప్రజల ఆరాధ్య దేవత సవదత్తి యల్లమ్మ ఆలయ హుండీలో నగదు, బంగారు, వెండి తదితర ఆభరణాలతో పాటు విచిత్ర కోరికలతో చీటీ రాసి భక్తులు తమ సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు. ఈ సారి హుండీ లెక్కింపులో తమ ఇంట్లోని నల్లుల బెడదను నిర్మూలించాలని కోరుతూ భక్తుడు రాసిన చీటీ తీవ్ర చర్చనీయాంశమైంది. అమ్మా.. తల్లి.. యల్లమ్మ దేవి మా ఇంట్లో నల్లుల బాధ పెరిగిపోయింది. వాటిని ఇంటి నుంచి పారదోలితే మీ గుడికి వచ్చి పండ్లు, ఫలాలు సమర్పిస్తామని ఆ చీటిలో భక్తుడు అమ్మవారిని వేడుకున్నాడు. అలానే వివిధ రీతుల్లో తమ కష్టాలను తీర్చాలని చీటీల ద్వారా యల్లమ్మకు భక్తులు వేడుకుంటున్నారు. కాగా యల్లమ్మ గుట్టలో గత నాలుగు రోజుల నుంచి జరిగిన హుండీల లెక్కింపు బుధవారం ముగిసింది. రూ.2.69 కోట్ల విలువైన కానుకలు వచ్చాయని సంబంధిత అధికారులు తెలిపారు. వీటిలో రూ.2.34 కోట్ల నగదు, రూ.26.95 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.7.32 లక్షల విలువైన వెండి ఆభరణాలు వచ్చాయి. మే 7 నుంచి అక్టోబర్‌ 10 వరకు భక్తులు హుండీలో వేసిన కానుకల వివరాలు అని, వీటిని ఆలయ అభివృద్ధికి వాడతామని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

భూ లీజుపై తప్పుడు సమాచారం

●మంత్రి బసవంతప్పపై మాజీ మంత్రి

ఆనంద్‌సింగ్‌ ఆరోపణలు

హొసపేటె: నగర శివారులో బళ్లారి రోడ్డులోని కారిగనూరు వద్ద ఉన్న ఆర్‌బీఎస్‌ఎస్‌ఎన్‌ మైనింగ్‌ కంపెనీకి చెందిన 64.50 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చే అంశంపై జరిగిన మంత్రివర్గ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కేఎస్‌ బసవంతప్ప హాజరైనా, తాను సమావేశానికి హాజరు కాలేదని చెప్పి మీడియాకు, జిల్లా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారని మాజీ మంత్రి ఆనంద్‌సింగ్‌ ఆరోపించారు. ఆయన తన నివాసంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 1న నగరంలోని జిల్లా స్టేడియం వద్ద మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ భూమిని లీజుకు ఇచ్చే అంశంపై జరిగిన కేబినెట్‌ సమావేశానికి తాను హాజరు కాలేదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెప్పినట్లు ఆనంద్‌సింగ్‌ గుర్తు చేశారు. సంబంధిత కేబినెట్‌ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కేఎస్‌ బసవంతప్ప కూడా హాజరయ్యారన్నారు. భూమి లీజు మంజూరు అంశం గురించి మంత్రికి ముందుగానే తెలిసినా, తనకు ఆ విషయం తెలియదని చెప్పారని ఆరోపించారు. అంతేకాకుండా ఈ విషయం తెలిసిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి భూ లీజు ప్రక్రియను నిలిపి వేయాలని కోరినట్లు మంత్రి చెప్పారని ఆనంద్‌సింగ్‌ ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement