బళ్లారిఅర్బన్: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రాయల్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల పెంపు, పాల ధరల పెంపు, బస్సు చార్జీల పెంపు, ప్రభుత్వ ఖజానా పరిస్థితిని ప్రశ్నిస్తూ యువమోర్చా నాయకులు ఆందోళన చేపట్టారు. యువజన ఉద్యమంలో భాగంగా విరాళాల సేకరణతో పాటు వినూత్న ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఆందోళనలో జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు ఆర్.శరణ్‌గౌడ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలపై భారం మోపడం తగదు
రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచి పెంచిన పాల ధరలను, 4 నుంచి అమలు చేసిన ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని జిల్లా బీజేపీ రైతు మోర్చా నాయకుడు గణపాల ఐనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బస్సు ఛార్జీలను పెంచడం వల్ల పేదలు, మధ్య తరగతి కుటుంబాలు, విద్యార్థులు, కార్మికులు, రోజువారీ కూలీలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని అన్నారు. నిత్యం పనులు, చదువుల కోసం బస్సులపై ఆధారపడే ప్రజలకు ఈ పెంపు ఇబ్బందికరంగా మారుతుందన్నారు.
పెంచిన ధరలను విరమించాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నఫళంగా పెంచిన పాల ధరను తగ్గించాలని కేఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు నిరుపాది మాట్లాడారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు. ఒక వైపు పాల ధరను పెంచిన ప్రభుత్వం మరో వైపు ఆర్టీసీ బస్ చార్జీలను కూడా పెంచి పేదలపై భారం మోపిందన్నారు. పెంచిన ధరలను వెంటనే విరమించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.


